- 17 నుంచి దాన్య సేకరణ
- అన్ని జిల్లాల్లో వడ్ల కొనుగోళ్ల కేంద్రాలు
శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో) : శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి రైతులు పండించే ధాన్యాన్ని సేకరిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసన సభ్యులతో కలసి శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న మూడు, నాలుగు నెలలు ఛాలెంజ్ గా తీసుకొని ప్రతీ ధాన్యం గింజ రైతుల నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ధాన్యం సేకరణ ఒక పద్ధతి, విధానంలో సేకరించాలన్నారు. ఒరిస్సా నుండి ధాన్యం రాకుండా నివారించాలని ఆదేశించారు. గత ఐదు సంవత్సరాలుగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగలేదన్నారు. జిల్లాలో కొన్ని రైస్ మిల్లులను పక్కన పెట్టేవారని, అలాంటి వాటికి తావులేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేటు ఆర్గనైజేషన్ వారు కొనుగోలు చేస్తే అలాంటి వారు గతంలో వారు ఏ విధంగా సేకరించింది పరిశీలించాలన్నారు. మార్కెటింగ్, పీఏసీఎస్ లు, స్వయం సహాయక సంఘాల ద్వారా సేకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణ కేంద్రాలు ఎన్ని ఉండాలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా ఉండకూడదని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు నిబంధనలు ఎలాంటి నియమ, నిబంధనలు ఉండవన్నారు. రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ విక్రయాలు చేసుకోవచ్చని వెల్లడించారు. గత ఐదు సంవత్సరాలుగా ఏ రైస్ మిల్లు ఎంత ధాన్యాన్ని సేకరించిందో ఆ వివరాలను తెలపాలన్నారు. రైతు పండించిన ప్రతీ గింజ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. రీ సైక్లింగ్ చేయాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. వాస్తవాలను తెలుసుకొని ముందుకు వెళదామన్నారు. ధాన్యం సేకరణ ఒక ప్రస్టేజిగా తీసుకొని కొనుగోలు చేయాలన్నారు. జిల్లా రైతులు తడి ధాన్యాన్ని తీసుకు రాకూడదని, ధాన్యం తడిగా ఉంటే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని రైతులను ఆయన కోరారు. ఏ ఒక్క గింజ వదిలి పెట్టమన్నారు. గ్రేడ్ ఎ ప్రమోట్ చేయాలన్నారు. బ్యాంకర్లు గ్యారంటీలు సిద్దంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ 17వ తేదీ నాటికి బ్యాంకలన్ని గ్యారంటీలు సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ… ధాన్యం సేకరణ ఈ నెల 17 నుండి సేకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కస్టోడియన్ ఆఫీసర్లుగా సి.యస్ డీటీలను నియమిస్తామన్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణ మూర్తి, డి.వెంకటేశ్వరరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి త్రినాధ స్వామి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్య కిరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.