ప్రభ న్యూస్, ఇబ్రహీంపట్నం : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ప్రాంతం వద్ద ఉన్న పవిత్ర సంగమాన్ని పునఃనిర్మాణం చేసి పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పవిత్ర సంగమం గురించి మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు.
సాయంత్రం ఎమ్మెల్యే వసంతతో కలిసి మంత్రి ఆనం పవిత్ర సంగమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంగమాన్ని ప్రారంభిస్తే గడిచిన ఐదేళ్ల వైసీపీ దుర్మార్గపు పాలనలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పవిత్ర సంగమాన్ని తిరిగి ప్రారంభించాలని ఎమ్మెల్యే వసంత కోరిన వెంటనే దేవదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించినట్లు వివరించారు.
అన్ని పరిస్థితులు గమనించిన తరువాత మరిన్ని శాఖలతో చర్చించి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పవిత్ర సంగమం ఎంతో పవిత్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకున్నారని చెప్పారు. దురదృష్టవశాత్తు వైసీపీ పాలనలో పవిత్ర సంగమం అపవిత్రమైందని, ఈ ప్రాంతాన్ని అంధకార మయం చేశారని విమర్శించారు.
నేడు పరిస్థితులు మారాయని, ప్రజా పరిపాలన వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమున్నత నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. గతంలో నిత్య హారతులతో వేలాది మందికి కన్నుల పండువగా ఉన్న పవిత్ర సంగమంలో రాబోయే 15 రోజుల్లోనే నిత్య హారతులు తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిసి వివరిస్తామన్నారు. అలాగే మిగిలిన శాఖల అధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించి పవిత్ర సంగమాన్ని ప్రజలకు అంకితం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఓ శుభ ముహుర్తాన ప్రారంభించి ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక, వైదిక, హిందూ ధర్మాలను కాపాడుతూ పుణ్య హారతులతో పవిత్ర సంగమానికి మరింత పవిత్రత చేకూర్చాలని దుర్గాదేవిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ అభ్యర్థి చుట్టుకుదురు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.