అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర రోడ్డు, రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన రేణిగుంట మండలం కొత్తపాలెంలో శ్రీకారం చుట్టారు. ఎన్‌హెచ్ 71 రహదారిలోని రేణిగుంట నాయుడు పేట వరకు 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
ప్రధాని ఆలోచనకు అనుగుణంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ జరుగుతుందని 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్ల స్వల్ప కాలంలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపయిందని పేర్కొన్నారు. ఇంధన సంరక్షణ, కాలుష్య నివారణ కొరకు ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియాను ప్రారంభించినట్లు చెప్పారు. పర్యావరణ అనుకూల రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్లాంటేషన్ డ్రైవ్ చెపట్టడం జరిగిందని దీనిలో భాగంగా నాటిన మొక్కల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2016 నుంచి 2022 వరకు 2.74 కోట్ల మొక్కలు నాటి వాటిని హరిత్ పాత్ మొబైల్ యాప్ ద్వారి జియో ట్యాగింగ్ చేశామన్నారు. దేశవ్యాప్తంగా 300కు పైగా ప్రాజెక్టుల్లో ప్లాంటేషన్ డ్రైవ్ నడుస్తుందని ప్రతి ప్రాజెక్ట్‌లో 1000 మొక్కలు నాటుతున్నామని చెప్పారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో 3 లక్షలకు పైగా మొక్కలను నాటనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. పర్యావరణానికి అనువుగా బయో ఇథనాల్ ఇంధనం వాడకంలోకి తీసుకువస్తున్నామని దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు పెట్రోల్, డీజీల్ కూడా తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.