రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మనమే విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా ?. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా ? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ప్రజలు. ఇది నాకున్న బలమన్నారు.
ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరూ(ప్రజలు).. అర్జునుడిని నేను, చేసిన మంచంతా అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దామంటూ పిలుపు ఇచ్చారు. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించండి. సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి అని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడు? ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని దెందులూరు సిద్ధం వేదిక నుంచి ప్రతిపక్ష నేతను సీఎం వైఎస్ జగన్ నిలదీశారు.