అమరావతి, ఆంధ్రప్రభ: గత కొద్ది రోజులుగా కరోనా తదనంతర సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్‌లు గురు వారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ తరువాత ఆరోగ్య పరంగా స్వల్ప సమస్యలు ఎదురు కావటంతో వీరిని ప్రత్యేక విమానంలో ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజి) హాస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం దంపతులు ఇరువురు పూర్తిగా కోలుకున్నా రు. ఈ నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, బబితా దంపతులు హైదరాబాద్ ఏఐజి ఆసుప్రతికి వెళ్లి హరిచందన్ దంపతులను పరా మర్శించి యోగ క్షేమాలు తెలుసు కున్నారు.
గవర్నర్ కు వైద్య సేవలు అందిస్తున్న ప్రత్యేక బృందంతో సమా వేశమైన సిసోడియా భవిష్యత్తులో ఆరోగ్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి విచారించారు. డిశ్చార్జికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తది తరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తాను అన్ని విధాల పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు- విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు అప్రమ త్తంగా ఉండాల న్నారు.