విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరిగిన సందర్భమే లేదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిశారు. అనంతరం చంద్రబాబు జనసేనాని పవన్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని, చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, అవసరమైతే అక్రమాలపై కోర్టుకు కూడా వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సచివాలయ వాలంటీర్స్‌తో ఎన్నికలు నడపాలని వైసీపీ చూస్తోందన్నారు. తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. అయితే ఎన్నికల విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమిషన్ మాట ఇచ్చిందన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా.. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని కమిటీ చెప్పిందన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. చంద్రగిరిలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదైన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ దొంగ ఓట్లలో కొన్నింటిని ఆమోదించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం కూడ చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.
మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఈసీ దృష్టికి తెచ్చారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు. రెండు నెలలముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగివచ్చేలా ప్లాన్ చేశారని, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తమకు హామీ ఇచ్చిందని జనసేనాని వెల్లడించారు.