అమరావతి, ఆంధ్రప్రభ : మహిళా కమిషన్ పవర్ ఏంటో చూస్తారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, బొండా ఉమాలనుద్ధేశించి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ బొండాలాంటి వారికి సుప్రీమేనని, నోటీసులు జారీ చేశాక తప్పకుండా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే ఏమ్రాతం గౌరవం లేదని, కాని నేడు కమిషన్ పవర్‌ఫుల్‌గా వ్యవహరిస్తోందని, మహిళా కమిషన్ డమ్మీ కాదని అన్నారు. రాజ్యాంగ వ్యవస్ధలను గౌరవించడం టీడీపీ నేతలు నేర్చుకోవాలని, అయినా బాధితురాలి వద్ద రాజకీయాలు చేయడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలిని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం పరామర్శించిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ నేతల నుంచి ఎదురైన ప్రతిఘటన తదితర అంశాలపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై బల ప్రదర్శన చేయడమేంటని ప్రశ్నించారు. బహిరంగ సభలో మాదిరిగా బాధితురాలి వద్ద టీడీపీ నేతలు ప్రవర్తించారని మండిపడ్డారు. మానవత్వం లేని చంద్రబాబు అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా అంటూ సీరియస్ అయ్యారు. బాధితురాలు భయపడుతుందని చెపితే తనను భయపెట్టే ప్రయత్నం చేశారని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.