అమరావతి, ఆంధ్రప్రభ:ఆంధ్రప్రదేశ్ స్ధానికత కలిగి తెలంగాణాలో పని చేస్తున్న హోంగార్డుల భవిష్యత్తుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్ళు అవుతున్నా.. హోంగార్డుల విభజనకు సంబంధించి ఇప్పటివరకూ ఏవిధమైన నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకోకపోవడం దురదృష్టకరం. దీంతో ఏపీకి రాలేక.. తెలంగాణాలో తమ సేవలు అందిస్తూ కూడా మంచి చెడుకు నోచుకోక తమ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా పరిణమించింది. ఈనేపధ్యంలో రెంటికి చెడ్డ రేవడిలా ఉంది తమ పరిస్ధితి అంటూ అక్కడి ఏపీ హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివి బతుకు తెరువు కోసం హోంగార్డులుగా జీవనం ప్రారంభించిన చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిక్రూట్‌మెంట్ అయినావరే. వీరిలో అధిక శాతం 30ఏళ్ళుగా సేవలు అందిస్తూ శాశ్వత జీవనోపాధి లేక బండి లాగించేస్తున్నారు. అయితే ఆతర్వాత జరిగిన ఎంపికలో డిగ్రీ అభ్యర్ధులు సైతం ఉన్నారు. వీరిలో కంప్యూటర్ పరిఙ్ఞానం కూడా ఉన్న వారు లేకపోలేదు. అయితే చాలావరకు యువత హోంగార్డులుగా చేరి పని చేస్తూనే డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుళ్ళు, ఎస్‌ఐలుగా వెళ్ళాలనే ఆలోచనతో వచ్చినవారూ లేకపోలేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగురాష్ట్రాల్లో హోంగార్డుల పరిస్ధితి మరింత అధ్వానంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మరింత దారుణంగా ఉంది. ఏపీలో ప్రస్తుతం సుమారు 12 నుంచి 15వేల మంది హోంగార్డులు వివిధ యూనిఫాం ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి చెందిన సుమారు 1500మంది వరకు హోంగార్డులు తెలంగాణాలోనే ఉండిపోయి ఇప్పటికీ ఆ రాష్ట్రానికే సేవలందిస్తున్నారు. స్వంత రాష్ట్రానికి వచ్చేయాలని ఎంత ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గత ఎనిమిదేళ్ళుగా అక్కడి ఏపీ హోంగార్డులు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. చాలామంది వీరిలో ఉద్యోగం వదులుకోలేక ఏపీ నుంచి హైదరాబాద్, తదితర తెలంగాణా ప్రాంతాలకు అప్ అండ్ డౌన్ చేస్తున్న పరిస్ధితి. రాయలసీమ జిల్లాలకు చెందిన అనేక హోంగార్డులు భార్య బిడ్డలను ఏపీలో ఉంచి ఉద్యోగం తెలంగాణాలో చేస్తూ వారానికో.. నెలకో.. సెలవుకో వచ్చి వెళ్తున్నారు. తమ కష్టాలు అనేకమార్లు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తప్ప కింది స్థాయిలో ఉండే ప్రతి ఒక్క అధికారి, సంబంధిత ప్రజాప్రతినిధులను కలిసి విఙ్ఞప్తులు చేశారు. రెండు రాష్ట్రాల డీజీపీల దృష్టికి కూడా తీసుకెళ్ళారు.
రిక్రూట్‌మెంట్లలో కోటా కోల్పోతున్నాం..
రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన సమస్య పోలీసు రిక్రూట్‌మెంట్లలో అవకాశాలు కోల్పోవడం. ప్రస్తుతం అక్కడ సుమారు 1500 మంది హోంగార్డులు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో కొంతమంది ఉమ్మడి రాష్ట్రంలో నుండే 20- 30 ఏళ్ల పాటు సర్వీసు అందిస్తూ చిన్న చిన్న ఇల్లు కట్టుకుని, పిల్లలను చదివించుకుంటూ స్ధిరపడినవారే. దీంతో టిఎస్‌ను వదిలి స్వంత రాష్ట్రం ఏపీ వచ్చేందుకు సుమారు 700 మంది సిద్దంగా ఉన్నారు. వీరిలో 450 మంది వరకు ఇప్పటికే ఏపీ వచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తెలంగాణాలో మూడుసార్లు పోలీసు ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లు జరిగాయి. ఈ రిక్రూట్‌మెంట్లలో హోంగార్డులకు ఉండే కోటా కింద కానిస్టేబుల్‌గా చేరేందుకు ఏపీ స్ధానికత కలిగిన వారికి అవకాశం లేకుండాపోయింది. సేవలు అక్కడి అందిస్తున్నప్పటికీ స్థానికత లేకపోవడమే అడ్డంకిగా మారింది. పోనీ ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డు కోటా కింద చేరాలంటే ప్రస్తుతం వారు తెలంగాణా ప్రభుత్వానికి సేవలందిస్తూ జీతం అక్కడినుంచే పొందుతున్నారు. దీని వల్ల ఏపీలో అవకాశం లేకుండాపోయింది. ఇలా అటు ఇటు కాని పరిస్ధి తిలో శాశ్వత జీవనోపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల చదువులు.. వారి భవిష్యత్తు ప్రశార్ధకం..
మరోవైపు తెలంగాణాలో ఏపీ స్ధానికత హోంగార్డుల పిల్లల చదువులు, వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపధ్యంలో తమ పిల్లలను స్కూళ్ళలో ఎక్కడ చేర్చాలనే మీమాంస కొనసాగుతోంది. తెలంగాణాలో చేర్చి వేలకు వేలు ఫీజులు చెల్లించాక.. ఏపీకి వెళ్ళిపోవాలంటే ఇబ్బందే. అలాకాకుండా ఏపీలో బడుల్లో చేర్చి ఫీజులు కట్టాక తమను స్వంత రాష్ట్రానికి పంపకపోతే మరో సమస్య. ఇలా స్పష్టత లేని కారణంగా ప్రతి ఏడాది ఇదే సమస్య తమకు ఎదురవుతోందని. దీని వల్ల పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు. దీని వల్ల తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించే విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
తెలంగాణా ఎన్‌ఓసీ ఇచ్చినా ఏపీ తాత్సారమే..
ప్రస్తుతం సేవలందిస్తున్న తెలంగాణతో పోల్చితే ఏపీలో హోంగార్డుల వేతనం తక్కువేనని, అయినా స్వంత రాష్ట్రానికే వచ్చేస్తామని అంటున్నారు. ఈ దిశగా పోరాటం చేస్తున్న క్రమంలో 450 మంది దరఖాస్తులు పరి శీలించిన తెలంగాణా ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చినా ఏపీ ప్రభుత్వం తేల్చడం లేదని తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణాలో 27వేల వేతనం అందుకుంటున్న తాము ఏపీకి వస్తే వచ్చేది 22వేలేనని, అయినా రావడానికే మొగ్గు చూపుతున్నామని, ఇందుకు సంబంధించి ప్రాసెస్ ప్రారంభమై రెండేళ్ళయినా ప్రభుత్వం తేల్చడం లేదంటున్నారు. సీఎం జగన్ మినహా సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ప్రభుత్వ పెద్దలను డీజీపీ సవాంగ్ ను కలిసి తమ గోడు చెప్పుకున్నామని, ప్రభుత్వం కనుక కరుణించి అంగీకారం తెలిపితే తక్షణమే రిలీవ్ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అందువల్ల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తమపై దయతలిచి తెలంగాణా నుంచి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, ఏపీ స్ధానికతతో ఇక్కడే సేవలందించడం వల్ల కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కోటా కూడా పొందగలుగుతామని,, తమ జీవితాలు బాగుపడతాయంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.