తిరుమల : సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తున్నామని.. సామాన్య భక్తుడే తన మొదటి ప్రాధాన్యత అని నూతన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్ గా భూమాన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధనవంతులకు ఊడిగం చెయ్యడానికో… వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చేపట్టలేదన్నారు. హింధూ ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు… స్వామి భక్తుడికి అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అన్నారు.
టిటిడి చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా… ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్న కోరిక సమంజసం కాదన్నారు. కోట్లాది మంది టిటిడి చైర్మన్ పదవిని ఆశిస్తూ వుంటే… సామాన్య భక్తుడినైన తనను స్వామి వారు అనుగ్రహించారన్నారు. నాలుగు సంవత్సరాలు పాలక మండలి సభ్యుడిగా వున్నా… నాలుగు సార్లు కూడా విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్లలేదన్నారు. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహా లఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నానన్నారు.
భక్తులకు దర్శనం చెయ్యించడమే కాదు… భక్తులు వద్దకే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకెళ్తామన్నారు. చిన్న సమస్య కూడా లేకుండా రోజుకి 85వేల మంది భక్తులుకు దర్శనం చెయ్యిస్తున్న ఆలయం తిరుమలే అన్నారు. తాను దర్శనాలు చేసుకోవడానికి … దర్శనాలు చెయ్యించడానికి అయిన అధ్యక్షుడిని కాదన్నారు. సామాన్య భక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సామాన్యుడి వైపు… టిటిడి ఉద్యోగుల వైపు వుంటానన్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరికి పాలకమండలి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం తనకు ఒక్కడికే వచ్చిందని తెలిపారు.