Friday, November 22, 2024

AP: డబుల్ హ్యాట్రిక్ అదృష్టవంతులం… ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం, జూన్ 5: వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించిన రికార్డును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడం ఆనందంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన భీమిలి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ… టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు, ధూళిపాళ్ల నరేంద్ర ఆరుసార్లు గెలిచినప్పటికీ మధ్యలో ఓటమిని ఎదుర్కొన్నారని తెలిపారు. రాజకీయాల్లో రజతోత్సవ సంవత్సరమైన 2024 డబుల్ హ్యాట్రిక్ విజయంతో పాటు 92వేలకు పైబడిన రికార్డు మెజారిటీని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.

భీమిలి ప్రజలు సొంత కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. భీమిలిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, ప్రజల అంచనాలకు తగ్గట్టు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భారీ మెజారిటీ కోసం ఎన్నికల్లో కష్టపడిన భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలు, మధురవాడ, సింహాచలం, ఎల్లపువాని పాలెం, నగరంలోని కొండ వాలు ప్రాంతాల నాయకులు, కార్యకర్తలను అభినందించారు. లోకల్ మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తానన్నారు.

- Advertisement -

సైకిల్ కు పవర్ ఇంజన్ బూస్ట్ పవన్ కల్యాణ్ …
టీడీపీ సైకిల్ గుర్తుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఇంజన్ బూస్ట్ తోడైందని, అందుకే ఎవరూ ఊహించని సీట్లు, మెజారిటీలను సాధించామని గంటా అన్నారు. జగన్ అరాచక పాలనను అంతమొదించాలన్న ఏకైక లక్ష్యంతో తన బలానికంటే తక్కువ సీట్లకు రాజీ పడి వంద శాతం సీట్లలో గెలిచి రికార్డు సృష్టించారని చెప్పారు. అరాచకం, విధ్వంసంతో అనుక్షణం భయపెట్టిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. వన్ టైం సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గంటా రవితేజ, టీడీపీ పార్టీ ఇంచార్జీ కోరాడ రాజబాబు, గాడు వెంకటప్పడు, డి.ఎ.వి.రాజు, గోపీ రాజు, జనసేన నాయకుడు ఎస్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సింహాచలేశుని దర్శించుకున్న గంటా…
భీమిలి ఎమ్మెల్యేగా రికార్డు మెజారిటీ సాధించిన గంటా శ్రీనివాసరావు బుధవారం సింహాచలం శ్రీ నృసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు దేవస్థానం వర్గాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని కోరుకున్నారు. వేదపండితులు గంటాకు ఆశీర్వచనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement