నరకం.. నరకం యమ కష్టం
మహా నష్టం
బెజవాడ జనం ఆక్రోశం
వరద పోయే బురద వచ్చే
మురుగు నీరు పీడన
మోటారుతో తోడినా కరుణించని డ్రెయిన్
సందులన్నీ కంపు కంపు
వీధులన్నీ డంపింగ్ యార్డులే
బీదాబిక్కీకి డేరాలే దిక్కు
టీ-వీలు.. ఇంటి సామాగ్రి వీధిపాలు
చిరువ్యాపారుల బతుకులు భగ్నం
కూరగాయల ధరలకు రెక్కలు
బియ్యం కోసం జనం బారులు
తాగునీటి ట్యాంకర్ల సందట్లో పానీపట్టు- యుద్ధాలు
స్వచ్ఛంద సంస్థల వితరణతో ఏపూటకాపూట మమ
చదువుల బిడ్డల కళ్లల్లో ఇంకిన కన్నీళ్లు
ఇదీ బెజవాడ వరద దీన స్థితి
బెజవాడపై బుడమేరు బుస బుస ఇరవై ఏళ్ల అక్కసును తీర్చుకుంది. పది రోజులుగా బెజవాడను నీళ్లల్లో నానబెట్టింది. ఆకలి దప్పుల రుచిని చూపింది. ఎట్టకేలకు బుడమేరు శాంతించిందని జనం వీధుల్లోకి వస్తే.. బురద ఇకిలించింది. కంపు పలకరించింది. ఎర్ర రేవడి నీరు నల్లగా మారిపోయింది. నడవటానికి దారులు లేవు. ఎక్కడ చూసినా.. ఒకటే వ్యథ. ఇంటి సామాను సర్వనాశనం. కట్టు-కునే బట్టలు లేవు. దండానికి వేలాడి దీసినా.. ఆ వాసన అంతాయింత కాదు. గూడు చెదిరింది. డేరాలే దిక్కయ్యాయి.
పసిబిడ్డల ఆకలి తీర్చటానికి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాయగూరల ధరలు రెక్కలు విప్పాయి. బియ్యం బస్తాలు తడిచి నాని పోయాయి. సర్కారు పంచే పాతిక కిలోల బియ్యం కోసం అప్పటికే ఇరుగు పొరుగూ బారులు తీరింది. తాగునీటి కోసం ట్యాంకర్లు పిలిస్తే.. అక్కడా పోటాపోటీ-.. పానిపట్టు- యుద్ధమే. బడి తెరుచుకోలేదు. వరదలో మునిగి తేలిన పుస్తకాలు దీనంగా కనిపిస్తే.. ఆ చదువుల బిడ్డల కన్నీళ్లు ఇంకిపోయాయి.
అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారంతో ఈ రోజు మమ అనిపిస్తుంటే.. ఇక చిరువ్యాపారుల స్థితి అత్యంత దయనీయం. వేడి వేడి ఇడ్లీ , ఉల్లి దోసెలు అందించిన పేదరాశి పెద్దమ్మలు తమ అంగడిని సర్దుకోవటమే సరిపోయింది. ఇక మధ్య తరగతి గతి వర్ణనాతీతం. రంగు రంగుల టీ-వీల్లో రోజువారీ సీరియల్స్ తో కాలంగడిన ఇల్లాళ్లు.. తమ టీ-వీలను బయటపడవేసే స్థితి. వీధులన్నీ డంపింగ్ యార్డుల్లా మారాయి. డ్రెయినేజీ కాల్వల్లోని మురుగు నీరు వీధుల్లో తాండవిస్తుంటే.. మోటార్లతో ఎంత తోడినా .. ఆ డ్రెయిన్ లో నీరు తగ్గటం లేదు. ఇక నీళ్లల్లో మునిగి నిర్జీవ స్థితికి చేరిన తమ బైకులు ..ఆటోల ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ లకు .. బీమా డేరాలకు చేరి.. తమకు పరిహారం దక్కుతుందో లేదో ఎరుగని స్థితిలో మధ్యతరగతి జీవి మధన పడిపోతున్నారు. అక్కడక్కడ జ్వరాలకు, వాంతులు, విరోచనాలకు వైద్య సిబ్బంది ఇచ్చే మందులతో బక్కచిక్కినోళ్లు కాలం గడిపేస్తున్నారు. ఇదీ బెజవాడలో పదిరోజుల బుడమేరు విలయ తాండవ ప్రతిఫలం. అపార్ట్ మెంటు-ల నుంచి రేకు ల షెడ్డు వరకూ.. స్లమ్ ఏరియాల వరకూ .. బెజవాడలో జనం అనుభవిస్తున్న ఈ నరక యాతన ఎన్నాళ్లు? ఎన్నాళ్లో?