అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా డెల్టా కాల్వలకు నీరు నిలిచిపోయింది. దీంతో వర్షాభావం వల్ల లేట్ ఖరీప్ సీజన్లో వరి పండించిన రైతుల్లో ఆందోళన మొదలయింది. ఖరీఫ్‌లో సేద్యాన్ని నిలుపుదల చేసి రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగు మొదలుపెట్టిన రైతాంగం కూడా కలవరపాటు-కు గురవుతోంది. జలాశయాలు నీళ్ళు లేక అడుగంటిన నేపథ్యంలో రబీలో సాగు కోసం నీటిని విడుదల చేయటం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా చివరి ఆయకట్టు-లోని చీరాల సబ్ డివిజన్ ఫరిధిలోని కారంచేడు, చీరాల, చినగంజాం, వేటపాలెం మండలాల్లో సాగవుతున్న పంటలకు డిసెంబరు 15 వరకు వారబందీ విధానంలో నీళ్లొదులుతామనీ, మిగతా డెల్టా ఏరియాలో కాల్వలకు నీటిని విడుదల చేయటం సాధ్యం కాదని గుంటూరులో ఇటీ-వల నిర్వహించిన నీటి పారుదల సలహామండలి సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో అతికొద్దిగా ఉన్న నిల్వలను తాగునీటి అవసరాల కోసం ఉపయోగించాల్సి ఉన్నందున ఈ ఏడాది రెండో పంటకు నీళ్లివ్వటం సాధ్యం కాదని అధికారులతో పాటు- నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రబీలో వరి, మొక్క జొన్న పంటలు కాకుండా పొగాకు, అపరాలు వంటి ఆరుతడి పంటలపై రైతులు మొగ్గు చూపాలని అధికారులు సలహా ఇచ్చారు. లేట్ ఖరీఫ్‌లో సాగైన వరి చేతికందే సమయంలో నీటిని నిలుపుదల చేయటం వల్ల తీవ్రంగా నష్టపోతామని సాగర్ ఆయకట్టు- రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా డెల్టా కింద 16.08 ఎకరాల ఆయకట్టు- ఉంది. ఆయకట్టు- పరిధిలో 90 శాతం వరిని పండించటం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కృష్ణా ఎడమ కాల్వ పరిధిలో అవనిగడ్డ, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో సాగవుతున్న వరికి నీటి అవసరం ఎంతో ఉందనీ, మరో తడి నీళ్లు వస్తే లేట్ ఖరీప్ లో సాగయిన పంట చేతికందే అవకాశముందని అన్నదాతలు చెబుతున్నారు. సాగర్ నీటిని నమ్ముకుని కృష్ణా జిల్లాలో 6.79 ఎకరాల్లో పంటలు సాగవుతుండగా అకస్మాత్తుగా కాల్వలకు నీటిని నిలుపుదల చేయటం వల్ల ఆయకట్టు- చివరి భూముల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఎగువ నుంచి వరద నీరు రాలేదు.. దీంతో కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయామయి. ఫలితంగా 2023-24 ఖరీఫ్ సీజన్లో 152.20 టీ-ఎంసీలు అవసరమైతే కేవలం 101.32 టీ-ఎంసీలు మాత్రమే సాగుకు అందింది. ఇది వరి సాగు విస్తీర్ణం, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించనుంది. కొందరు రైతులైతే ఖరీప్ సీజన్లో సేద్యాన్ని నిలిపివేసి రబీపై దృష్టి పెట్టారు. ఇపుడు కృష్ణా డెల్టా కింద కాల్వల్లో నీరు లేకపోవటంతో ఈ సీజన్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.