పోలవరం, ప్రభన్యూస్ : ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 15.92 మీటర్లు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం నకు 17.92 మీటర్లుకు చేరుకుంది. ప్రస్తుత సీజన్లో మొదటి సారి గోదావరికి వరద తాకిడి మొదలైంది. ప్రాజక్టు స్పిల్‌వే వద్ద 27.890 మీటర్లకు గోదావరి వరద నీటిమట్టం చేరుకుంది. ఇప్పటికే పోలవరం స్పిల్‌వే 48 గేట్లను ఇంజనీరింగ్ అధికారులు ఎత్తివేశారు. స్పిల్ వే గేట్ల నుండి లక్షా 15 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
అదేవిధంగా స్పిల్ వే దిగువన 17.91 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. వరద సీజన్ ప్రారంభం కావడంతో ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీ అదికారులు అప్రమత్తమయ్యారు. వరదల నేపథ్యంలో ఇంజనీర్లు ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేస్తూ పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వరదలు వచ్చినా గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనులు సాగే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగువ నుండి మరింత వరద నీరు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరద నీరు దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ గుడిలోని మొదటి గదిని ముంచెత్తింది.
ఆదివారానికి గుడి మునిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.దీంతో ఆలయానికి రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేశారు.ఇప్పటికే పాపికొండల టూరిజం బోట్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.మూడు నెలల తరువాత గానీ పర్యాటక బోట్లు గోదావరిలో తిరగే పరిస్థితి ఉండదు.పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్‌కి 902 కొండ ప్రాంతం నుండి ప్రాజెక్టు వాహనాల రాకపోకలు సాగించేందుకు స్పిల్ చానల్ లో వేసిన రహదారి మార్గం మీదుగా గోదావరి వరద జలాలు ఉ ద్రుతంగా ప్రవహిస్తున్నాయి.గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో స్పిల్ వే 48 గేట్ల ను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు.