Saturday, November 23, 2024

పోలవరం నుంచి కావేరికి నీళ్లు.. ఏపీ, తెలంగాణలో క్షేత్రస్థాయి పరిశీలన

అమరావతి, ఆంధ్రప్రభ : అత్యంత సంక్లిష్టమైన, వ్యయంతో కూడుకున్న భూసేకరణ సమస్య తలెత్తకుండా గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర జలశక్తి భావిస్తోంది. ఈ మేరకు దేశంలో నదుల అనుసంధాన ప్రక్రియ బాధ్యతలు నిర్వహిస్తున్న జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడీఏ) ప్రతినిధి బృందం ఏపీలో ఫర్యటించనుంది. గోదావరిలో పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి కృష్ణా-పెన్నాల మీదుగా గోదావరికి నీటి తరలిస్తే భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదని ఏపీ చెబుతోంది. గోదావరి జలాలను తెలంగాణలోని ఇచ్చంపల్లి బ్యారేజ్‌ నుంచి 141.3 టీ-ఎంసీలను నాగార్జున సాగర్‌ (కృష్ణా) లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి కుడి కాల్వకు సమాంతరంగా మరో కాల్వను తవ్వి సోమశిల, కండలేరు (పెన్నా) మీదుగా తమిళనాడు కావేరి గ్రాండ్‌ ఆనకట్టకు నీటిని తరలించాలని ఎన్‌డీడబ్ల్యుఏ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనను అమలు చేస్తే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, నల్లొండ జిల్లాల్లో పంటలు పండే భూములను సేకరించాల్సి ఉంటుంది. అదే పోలవరం విస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలిస్తే భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉండదని ఏపీ చెబుతోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో గతంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ అభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డే స్వయంగా ప్రతిపాదించారు. ఇటీవల హైదరాబాద్‌ జలసౌధలో ఎన్‌డబ్ల్యుడీఏ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయంపై రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నివేదిక అందించారు.

నదుల అనుసంధానానికి అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్న చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల స్థాయిలో చర్చించాలని కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ చర్చల కంటే ముందే ఏపీ ప్రతిపాదనను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని కేంద్ర జలశక్తి నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ డబ్ల్యు డీఏ నిపుణులు పోలవరం ప్రాజెక్టు విస్తరణ ప్రాంతంతో పాటు కృష్ణా-పెన్నాల మీదుగా నీటిని తరలించే ప్రతిపాదనలో ఉటంకించిన పరీవాహక ప్రాంతాల రూట్‌ మ్యాప్‌ ను పరిశీలించనున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మక్క (తుపాకుల గూడెం) బ్యారేజ్‌ నుంచి గోదావరి జలాలను తరలించాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదనను కూడా ఎన్‌ డీ డబ్ల్యు ఏ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

- Advertisement -

చత్తీస్‌గఢ్‌ ససేమిరా..!

గోదావరి-కావేరి అనుసంధానంపై చత్తీస్‌గఢ్‌ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలు పోను మిగులు జలాలు లేవని స్వయంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారికంగా స్పష్టం చేసిన నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియ ఒక దశలో స్తంభించిపోయింది. ఆ తరువాత చత్తీస్‌ ఘడ్‌ నీటిని వాడుకోని సమయంలో అక్కడ నుంచి 141.3 టీ-ఎంసీలను తరలిస్తామని ఎన్‌ డీ డబ్ల్యుఏ చెబుతోంది. చత్తీస్‌ ఘడ్‌ నీటిని వాడుకునే సమయానికి మహానది నుంచి గోదావరికి ఆ మేరకు నీటిని తరలించి ఆ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనను చత్తీస్‌ ఘడ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందువల్లనే ఇటీ-వల హైదరాబాద్‌ లో నిర్వహించిన సమావేశానికి కూడా చత్తీస్‌ ఘడ్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు. ఆ రాష్ట్రంతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మాట్లాడతారని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ- వెల్లడించింది. ప్రధానితో చర్చల సందర్బంగా చత్తీస్‌గఢ్‌ ఒప్పుకుంటే సరే, లేదంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై సీరియస్‌ గా చర్చించి అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement