అమరావతి, ఆంధ్రప్రభ: దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ సాగు నీటి ప్రయోజనాలను దెబ్బతీసేలా కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు రంగం సిద్ధ మైంది. ఒక వైపు కృష్ణా బేసిన్‌లో దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాలతో చర్చించాకే జాతీయ హోదాపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ చెబుతుండగా.. మరో వైపు సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కర్ణాటక ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ అన్ని క్లియరెన్సులు ఇస్తూ తుది ఆదేశాల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించటం వివాదాస్పదంగా మారుతోంది. సీడబ్ల్యూసీ ఆమోదం తెలపటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ- ఆమోదం తెలిపితే అప్పర్ భద్రకు అధికారికంగా జాతీయ హోదా దక్కటమే మిగిలి ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక ప్రతిపా దనలకు కేంద్రం ఆమోదం తెలపటం లాంఛన ప్రాయ మేనని అధికారవర్గాల సమాచారం. కృష్ణా జలాల్లో అప్పర్ భద్రకు అసలు నీటి కేటాయింపులే లేవు..బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్- 2) గతంలో ఆ ప్రాజెక్టుకు 9 టీ-ఎంసీలు కేటాయించినప్పటికీ అప్పటి ఆదేశాలు ఇంతవరకు నోటిఫై కాలేదు. ట్రిబ్యునల్ కేటాయింపులు 9 టీ-ఎంసీలే అయినా కర్ణాటక మాత్రం 29.90 టీ-ఎంసీల సామర్దంతో ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనిపై దిగువ రాష్ట్రాల్రు చేసిన అభ్యంతరాల వల్లనే 9 టీ-ఎంసీల కేటా యింపులను కూడా ట్రిబ్యునల్ ఇంతవరకు నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో కృష్ణాలో నీటి కేటాయింపులే పెండింగ్ దశలో ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఎలా కల్పిస్తారని ప్రాజెక్టుల పురొ గతిపై ఇటీ-వల నిర్వహించిన కేంద్ర జలశక్తి హైపవర్ కమిటీ- సమా వేశంలో ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది.
అప్పర్ భద్రపై అనేక సంశ యాలున్నాయి..ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టే అవకా శముంది. దీనిపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వాదనలు కొనసా గుతున్న నేపథ్యంలో జాతీయ హోదాకు సీడబ్ల్యూసీ అనుమ తివ్వ టం చట్ట విరుద్ధం..తక్షణం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలని హైపవర్ కమిటీ- సమావేశంలో పాల్గొన్న ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు.
తుంగభద్రపై తీవ్ర ప్రభావం
కృష్ణా ప్రవాహంలో వరద జలాలను దారి మళ్ళించి 29.90 టీ-ఎంసీలను నిల్వ చేసుకునేలా అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక నిర్మిస్తోంది. 6.25 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీనివల్ల కృష్ణాకు ఉపనదిగా ఉన్న తుంగభద్రకు వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా తగ్గనుంది. ఫలితంగా తుంగభద్ర కింద రాజోలుబండ డైవర్షన్ స్కీం ద్వారా సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టు-కు సాగునీరు అందటం కష్టమేనని జల వనరుల ఇంజనీర్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని హంద్రీనీవా, కేసీ కెనాల్ ఆయకట్టు-కూ ఇబ్బందులు తప్పవు..కృష్ణా బేసిన్ లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు వచ్చి చేరే వరద నీటి ప్రవాహం భారీగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్టు వ్యయం రూ 16,125 కోట్లు-
కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్రను భారీ ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. 2014లోనే రూ.16,125.28 కోట్ల అంచనా వ్యయం తో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. నీటి కేటాయింపులు లేకుండానే 2018 వరకు రూ 4,800 కోట్లను ప్రాజెక్టుపై వ్యయం చేసింది. అనంతరం అనుమతుల కోసం సీడబ్ల్యూసీని ఆశ్రయిం చింది. ఇపుడు ఏకంగా జాతీయ హోదా కోసం ప్రతిపాదనలు పంపి చకా చకా అన్ని దశల్లోనూ ఆమోదం పొందుతోంది. జాతీయ స్థాయి కోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్ధిక వ్యవహారాల కమిటీ- గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక్కటే మిగిలి ఉంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్ట నిబంధనలను అనుసరించి దిగువ రాష్ట్రాల్ర అభిప్రాయాలు తీసుకోకుండా అప్పర్ భద్రకు అనుమతులు ఇవ్వటానికి అవకాశమే లేదు. అన్ని నిబంధనలను కేంద్రం పక్కన పెట్టి జాతీయ హోదా ప్రకటిస్తే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై జలవనరుల ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తోంది.