Friday, November 22, 2024

Water Dispute – సాగ‌ర్ వ‌ద్ద కొన‌సాగుతున్న‌ టెన్ష‌న్ …వెన‌క్కి త‌గ్గ‌ని ఎపి…

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పై ఉద్రిక్తత కొనసాగుతుంది. దీంతో ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి నుండి టెన్షన్ కొనసాగుతుంది. నిన్న ఏపీ బలవంతంగా కుడి కాలువ నుండి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసుకున్నారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు ఏపీ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కృష్ణ రివర్ బోర్డ్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విభజన కలకలం సృష్టించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కృష్ణా నదిపై నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలీసులను మోహరించారు. అదే క్రమంలో డ్యామ్ భద్రత బాధ్యతలు చూసే తెలంగాణ పోలీసులు కూడా పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య బుధవారం మొదలైన వివాదం గురువారం కూడా కొనసాగింది. ప్రాజెక్టులోని 26 గేట్లలో 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వస్తాయని ఏపీ పోలీసులు పేర్కొంటున్నారు. డ్యామ్‌ని కబ్జా చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా తెలంగాణ పోలీసుల రక్షణలో ఉన్న సాగర్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 13వ గేటు వద్ద నీటిని విడుదల చేసేందుకు కంచెను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పగిలిపోయాయి.

ఏపీ అధికారులు పోలీసుల సహకారంతో నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ, ఏపీ అధికారులు వారిని నిలువ‌రించారు. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఏపీ అధికారులు మాత్రం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని తమ వాటా నీటి వాటా కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. దీంతో పాటు పోలీసుల సాయంతో సాగర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఏపీ పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరిస్తారని… ముళ్ల కంచెను తొలగించి వెనక్కి వెళ్లాలని ఏపీ పోలీసులకు సూచించారు. నేడు కూడా ఇరు రాష్ట్రాల అధికారులు దీనిపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement