Saturday, November 23, 2024

Water dispute – అంతులేని జగడం – తెరపడని సాగర్ డ్రామా

(ప్రభన్యూస్, గుంటూరు (క్రైమ్) / మాచర్ల)నాగార్జున సాగర్లో జలజగడంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మధ్య పోరాటంగా మారిన ఈ వ్యవహారం ప్రస్తుతం సద్దుమణినట్టు కనిపిస్తున్నా.. ఏపీలో అధికార యంత్రాంగం ఎక్కడ తగ్గటం లేదు. ఇప్పటికే కేంద్ర బలగాలు సాగర్ డ్యామ్ను స్వాధీనం చేసుకోగా.. కంట్రోల్ రూమ్ను ఏపీ పోలీసులు వీడలేదు. ఆదివారం ఓట్ల లెక్కింపు కారణంగా తెలంగాణా పోలీసులు వెనుతిరిగారు. అదే విధంగా నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ సర్కారు ఆదేశించింది. అదే విధంగా ఇరురాష్ర్టాల అధికారులను వీడియో కాన్ఫరెన్స్కు కేఆర్ఎంబీ ఆహ్వానించింది. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లల్లో నిమగ్నం కావటంతో ..తెలంగాణ అధికారులు వెనక్కి తగ్గారు

.దీంతో ఈ సమావేశాన్ని 6 వ తేదీ వరకూ వాయిదా వేశారు. 6న చర్చిద్దాం : కేంద్ర జలశక్తి శాఖ నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నది. ఈ అంశాలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో సమావేశంలో తెలిపారు.

తెలంగాణ సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6 న వీడియో సమావేశంలో కేంద్ర జల శక్తిశాఖ అధికారులు నీటి సమస్యలపై చర్చించనున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలిపారు. అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీ సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానున్నది. అనంతరం నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్‌ను ఆదేశించారు.

అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కేంద్ర జలశాఖ కోరింది. ఈనెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ .కెఎస్. జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. 6 న జరిగే సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావిస్తామని సీఎస్ జవహర్‌రెడ్డి కేంద్ర జల శక్తిశాఖ అధికారులకు తెలిపారు.

హైదరాబాదులోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నానికి మార్చేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి కేంద్ర జల శక్తిశాఖ అధికారులకు విన్నవించారు. అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించి ఉంచామని తెలిపారు.

- Advertisement -

ఏపీలో తాగునీటి ఎద్దడి : అధికారుల వివరణ

ఏపీలోని పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేఆర్‌ఎమ్‌బీ చైర్మన్‌కు ఏపీ జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా సాగు, తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లు తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో ఏపీ ప్రభుత్వ వాట ప్రకారం నీరు విడుదల కావడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నీరు విడుదల చేసుకోవడం, విద్యుత్ ఉత్పాదన కోసం నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడుకున్నారని పేర్కొన్నారు.తెలంగాణ పోలీసులపై కేసునాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కొనసాగుతోంది

. శుక్రవారం ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శనివారం తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు విజయపురి పీఎస్ లో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది జగన్ చిచ్చే : దూళిపాళ్ల

రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ మోహన్‌రెడ్డి నాగార్జు సాగర్లో చిచ్చుపెట్టాడని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల నీటి హక్కులను తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికితాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమా? స్వార్థ ప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం జగన్ పోలీసులను ఉసిగొల్పారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement