రాయలసీమ ప్రాంత రైతులకు శుభ పరిణామం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, జూలై 27: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నీటిని విడుదల చేశారు. శనివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్యతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మధ్య గేటుకు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి బటన్ నొక్కి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీరే సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు.
ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం రాయలసీమ రైతులందరికీ శుభ పరిణామమన్నారు. కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి పోటెత్తడంతో జులై నెలలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని సాయంత్రానికి పదివేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల పెంపుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 16.95 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ 12 టీఎంసీలు, గోరుకొల్లు రిజర్వాయర్లకు 4.1 టీఎంసీల సామర్థ్యం వరకు నీటితో నింపుతామన్నారు. ఉద్యాన పంటల సాగులో నీరు ఆదా కావడంతో పాటు అధిక ఆదాయం వస్తోందని… రైతులందరూ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపి మంచి దిగుబడులు సాధించి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులను సూచించారు. పోతిరెడ్డిపాడు నీటి విడుదలపై రాయలసీమ ప్రాంత రైతులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.
నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వల్ల కృష్ణా బేసిన్ లోని అన్ని డ్యాములు నిండుతున్నాయన్నారు. శ్రీశైల జలాశయ వెనుకటి జలాలతో తెలుగుగంగా, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా రాయలసీమ రైతాంగానికి ఉపయోగపడే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమన్నారు. శ్రీశైలం ముప్పు ప్రాంతానికి గురై 98 జీఓలోని సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తామని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. జల వనరుల శాఖ ఎస్ఈ వెంకటరమణ, ఆత్మకూరు ఆర్డీవో ఎం దాసు, పోతులపాడు గ్రామ సర్పంచ్ నిర్మలమ్మ, డిఇ లు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.