సోంపేట, మార్చి 19(ప్రభ న్యూస్) : శ్రీకాకుళం జిల్లా మందస రైల్వే స్టేషన్ లో కందిరీగలు దాడి చేయడంతో 35 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈఘటన ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మందస రైల్వే స్టేషన్ లో మంగళవారం విశాఖపట్నం వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కోసం ప్రయాణీకులు వేచి యున్న క్రమంలో కందిరీగల గుంపు ప్రయాణీకులపై దాడికి తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో టికెట్లు తీసుకొని ప్లాట్ పారంపై ఉన్న ప్రయాణీకులపై చెట్ల పైనున్న కందిరీగల గుంపు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు.
35మంది గాయపడగా, మరికొందరు స్టేషన్ గదుల్లోకి పారిపోయి తలుపులు మూసి తలదాచుకున్నారు. గాయపడిన బాధితులను స్థానికులు హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.ఈలోగా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి వెళ్లిపోవటంతో కొంతమంది ప్రయాణీకులు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇంటి ముఖం పట్టారు. మరికొందరు బస్సుల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లిపోయారు.. కందిరీగల దాడిలో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందడంతో ప్రాణాపాయం తప్పినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.