అధికారులే కాదు.. మంత్రులపైనే చర్యలు తప్పవు
కొన్ని చోట్ల ఆహారం అందలేదనే ఫిర్యాదులున్నాయి
మరింత వేగంగా సహాయక కార్యక్రమాలు చేస్తున్నాం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
ఐదు నిముషాల షోతో జగన్ సరిపెట్టాడు
పది జిల్లాల ప్రజలకు భోజనం కల్పించాం
తన పర్యటనలో ఒక్క ఫుడ్ ప్యాకెట్ ఇవ్వలేదు
ఏపీపై వైసీపీ కుట్రలు బయటపడుతున్నాయి
బ్యారేజీని బోట్లు ఢీకొట్టాయి..
స్కూళ్లల్లో భోజనం కలుషితం..
హాస్టళ్లల్లో కెమెరాలు వెలుగుచూస్తున్నాయి
జగన్ తీరుపై చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి
కాగా, నిన్న జక్కంపూడి ప్రాంతంలో నియమించిన ఓ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసిందని.. ఆయన్ను సస్పెండ్ చేసానని అన్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తీసేస్తానని హెచ్చరించారు. ”వరదలతో పేదల బాధలు వర్ణణాతీతం. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వచ్చాయి. దీంతో వారందరికీ బాధ, భయం ఉంటుంది. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలి. అందుతున్న సహాయంపై ఐవీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నాం. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా. అధికారులకు రెండు రోజులుగా చెప్పాం.. ఇప్పుడు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. మీనమేషాలు లెక్కించడం సరికాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులూ ఒడ్డి సేవ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలి. ఏవిధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలి. ఆర్థికంగా, నిత్యావసరాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా ఏది వీలైతే అది మీ శక్తిమేర చేయాలి. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం.
అందరూ బాగస్వాములు కండి..
“” ప్రభుత్వం నుంచి మేం చేయాల్సినవన్నీ చేస్తాం. సమాజం కూడా మాకు సాయం చేయాలి. మీకు కుదిరితే బాధితులకు వండిపెట్టి క్యారేజ్ పంపడమో.. వారికి ఆర్థిక సాయం చేయడమో ఇలా ఏది తోస్తే అది చేయండి. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. అంతేకానీ.. ఎవడో చనిపోతే మనకేంటి అనుకోకండి. రేపు మనం చనిపోతే మన శవాన్ని ఎవరు మోసుకెళ్తాడు? ఇలాంటి ఆలోచన తప్పు. మన ఇంట్లో మనిషి చనిపోతే ఎలా ఉంటుందో అలా బాధితులకు అండగా నిలవండి. మీడియా వర్గాలు కూడా తప్పుడు వార్తలు రాయకండి. ఇక జగన్ విషయానికొస్తే.. నిన్న ఐదు నిమిషాలు షో చేసాడు. కనీసం ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోలేదని చంద్రబాబు అన్నారు..
ఏపీపై వైసీపీ కుట్రలు…
ప్రకాశం బ్యారేజీ పిల్లర్ ను బోట్లు ఢీకొన్నాయి అని తెలీగానే ముందు ఇది ప్రమాదం అనుకున్నా. కానీ చాలా మంది అనుమానం ఉంది అంటున్నారు. దాంతో నాక్కూడా అనుమానం మొదలైంది. లేకపోతే వరుసగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆహారం కలుషితం కావడం ఏంటి? హాస్టల్‌లో కెమెరాలేంటి? ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి. నాకు అనుమానించడం తప్ప మరో దారి కనిపించడంలేదు. బాబాయిని హత్య చేసి నారాసుర చరిత్ర అని రాసినోడు ఎలాంటి కుట్రలకైనా పాల్పడతాడు. కాబట్టి ఏ నియోజకవర్గానికి చెందిన మంత్రి, ఎమ్మెల్యే తమ ప్రాంతాల్లో విజిలెన్స్ పెంచుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగనివ్వకూడదు. ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి “” అని తెలిపారు.
మళ్లీ జేసీబీపై చంద్రన్న పలకరింపులు
అనంతరం సీఎం చంద్రబాబు సితార సెంటర్ కు వెళ్లారు. విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్‌కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు. ఆహారం అందుతుందా..? లేదా..? అని బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.