Tuesday, November 26, 2024

యుద్ధం ఎఫెక్ట్ : ఆకాశాన్నంటుతున్న నూనె ధ‌ర‌లు

గ‌త వారం రోజులుగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్ధం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. ఈ యుద్ధం ఎఫెక్ట్ నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై ఎక్కువ‌గా ప‌డుతోంది. అక్క‌డ యుద్ధం జ‌రిగితే… ఇక్క‌డ ధ‌ర‌ల పెంపు బాంబులు పేలుతున్నాయి. ఏ దేశంలో విపత్తు వచ్చినా.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మనం వినియోగించే నిత్యావసర వస్తువులపైనే భారం పడుతోంది. దేశంలో నిత్యావసర వస్తువైన నూనె ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకు.. వంట నూనె ధరలు ఆకాశాన్నంట‌డంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు.. పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ వ్యాపారులు చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. విజయ బ్రాండ్ పేరుతో సమాఖ్య వంట నూనెలను నెల రోజుల వ్యవధిలోనే లీటర్ పామాయిల్ ధర రూ.29కి పెంచింది. ఆ ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదించింది.

రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి దిగుమతి అవుతోన్న పొద్దుతిరుగుడు నూనె ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. భారత్‌లో వినియోగించే వంట నూనెల్లో 70 శాతానికి‌పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. పామాయిల్, పొద్దు తిరుగుడు నూనెలు అయితే.. 90 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతుండడంతో ఈ ధరల పెరుగుదులకు కారణమవుతోంది. అక్క‌డి నుంచి మామూలు ధ‌ర‌ల‌కు దిగుమ‌తి అవుతున్నా… ఇక్క‌డ వ్యాపారులు మాత్రం యుద్ధం పేరుతో నూనె ధ‌ర‌లను పెంచేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.. మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా ధ‌ర‌లు పెంచారు… ఇప్పుడు యుద్ధం పేరుతో ధ‌ర‌లు పెంచుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement