రాజమహేంద్రవరం – తనకు రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఉందని, అధిష్టానందే తుది నిర్ణయమని అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్నారు.
ఇక, సంక్రాంతి పండగలోపు 32 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ నియమిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయన్న ఆయన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు వేస్తాం అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నవరత్నాలు కంటి తుడిపి చర్యగా అభివర్ణించారు సోము వీర్రాజు.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలు తప్ప.. చేసిన అభివృద్ధి ఏమి లేదని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. ఇక, రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న తీరులో ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో తెలియని భావన ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరును వైయస్సార్ ఆరోగ్య మందిర్ కింద పేరు మార్పు చేశారని ఎద్దేవా చేశారు. తనే ఇంటింటికి వైద్యం పంపిస్తున్నానని కలరింగ్ ఇస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు సోము వీర్రాజు.