Friday, November 22, 2024

శేషాచలం అడవుల్లో పెరిగిన సంచారం.. కాలినడక భక్తుల భద్రత కట్టుదిట్టం

తిరుపతి, ప్రభ న్యూస్‌ బ్యూరో :అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన సంఘటనతో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో టీటీడీ భద్రత ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాలినడక మార్గంలో ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటలవరకే అనుమతించాలని నిర్ణయించింది. ప్రతీ బాలబాలికకు వారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌తో కూడిన ట్యాగ్‌ను చేతికి పెట్టాలని నిర్ణయించింది. ఒకవేళ వారు తప్పిపోయినా గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు.

కాగా తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగిందని గుర్తించారు. ఒకటీ రెండూ కాదని, ఒక్క శనివారం నాడు ఐదు ప్రాంతాల్లో వేర్వేరు చిరుతలు సంచరించడం చూశామని అటవీసిబ్బంది చెప్పడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శ్రీవారి మెట్టు, అలిపిరి కాలి బాటలో కొండకు నడిచి వెళ్లే భక్తులకు గట్టి ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని గుంపులు, గుంపులుగా వెళ్లాలని వెళ్లే సమయంలో శబ్దం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

500 సీసీ కెమేరాల ఏర్పాటు

శుక్రవారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అటవీ శాఖ ఇప్పటికే ఆ ప్రాంతంలో పులులను బంధించేందుకు రెండు బోనులను సిద్ధంగా ఉంచినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

అంతేకాకుండా ఈ మార్గంలో గాలి గోపురం పాయింట్‌ నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు- చెప్పారు. మరోవైపు తిరుమలకు కాలినడక మార్గంలో పిల్లలతో కలిసి వెళ్తున్న తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక, అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత టీటీడీ మరిన్ని చర్యలు తీసుకోనుంది.

ఏడో మైలువద్ద చిన్నారులకు ట్యాగ్‌లు

తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారుల్లో పిల్లల అనుమతిపై టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాకుండా నడకదారిలో వెళ్తున్న పిల్లలకు ట్యాగ్‌లు కూడా కడుతున్నారు. కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు మిస్‌ అయితే.. ఈ ట్యాగ్‌ల ద్వారా వారి ఉనికిని కనిపెట్టేందుకు వీలవుతుందని చెబుతున్నారు. పిల్లలకు కట్టే ట్యాగ్‌లో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నెంబర్‌, పోలీసుల కంట్రోల్‌ సెంటర్‌ నెంబర్‌ ఉంటాయి.

ఇక, రెండో ఘాట్‌ రోడ్డులో సాయంత్రం 6 గంటల తర్వాత ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరించినట్టుగా టీటీడీ తెలిపింది. చిరుతపులి దాడి ఘటనకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సమీక్షించారు. చిన్నారి మృతదేహం లభించిన స్థలాన్ని కూడా సందర్శించారు. కాలినడక మార్గంలో వచ్చే యాత్రికుల ప్రాణాలను రక్షించడంపై టీటీడీ దృష్టి సారించిందన్నారు. లక్షిత కుటుంబానికి టీటీడీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ

చిన్నారులపై క్రూరమృగాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నుండి గాలిగోపురం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలు కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో శనివారం రాత్రి చిరుతల సంచారం కనిపించింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆదివారం నుండే ఈ నిర్ణయం అమలవుతోంది.

అదేవిధంగా రెండు ఘాట్‌ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement