అమరావతి, ఆంధ్రప్రభ: కరోనా ఉధృతితో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మే నెలలో కార్మికులను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రకటించింది.. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల వివరాలను సేకరించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదు. కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా వివరాలు సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 లక్షల మందికి పైగా కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందించాల్సిన సాయాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం, కొత్త పథకాల పేరుతో వారిని మభ్యపెదుతుందనే విమర్శలున్నాయి.
2020 డిసెంబర్‌లో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధాన్ యోజన పేరుతో అసంఘటితరంగ కార్మికులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లిస్తే, ఆ తర్వాత రూ.మూడు వేలు పెన్షన్ ఇస్తామంటూ పెద్దఎత్తున ప్రచారం చేసుకుంది. అసంఘటితరంగ కార్మికులకు ఆర్థిక భద్రత, సంఘటితరంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామంటూ 2021లో ఈ-శ్రమ్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించి హడావుడి చేసింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ-శ్రమ్ కార్డుల లక్ష్యం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించినా, ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు.
కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయం ఇవ్వకపోగా రకరకాల పేర్లతో ప్రవేశపెట్టే పథకాలతో ఏం ప్రయోజనమని కార్మికులు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా సాయం డబ్బులు వస్తాయని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు వివరాలు ఇచ్చాను. రెండేళ్లవు తున్నా మా ఖాతాల్లో డబ్బులు వేయలేదని పలువురు పేర్కొన్నారు.