Friday, November 22, 2024

విద్యుత్‌ శాఖలో వేతనాల లొల్లి ! గడచిన నాలుగు నెలలుగా ఇదే తంతు..

అమరావతి, ఆంధ్రప్రభ : తమ జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. మూడు డిస్కంల పరిధిలో ఎవ్వరికీ ఇంతవరకూ వేతనాలు అందలేదు. గడచిన మూడు, నాలుగు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోందని, ఫలితంగా బ్యాంకుల్లో తాము డీఫాల్టర్లుగా మిగలడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తమ పిల్లలకు సకాలంలో డబ్బులు పంపలేని పరిస్థితి నెలకొందంటూ వాపోతున్నారు. ఏప్రిల్‌ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇంకా పడలేదు. జీతాల మీద తాము బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నామని, జీతాలు సక్రమంగా పడకపోవడం వల్ల తమకు చెక్‌ బౌన్స్‌ అవుతోందని మొర పెట్టుకున్నారు. జీతాలు లేటుగా పడడం వల్ల ఇంటి అద్దెలు, స్కూల్‌ ఫీజుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ శాఖలోని విశ్రాంత ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్‌ డబ్బులు పడని పరిస్థితి. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించాలి లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. డిసెంబరు నెల నుండి విద్యుత్‌ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందిన పరిస్థితి లేదని వారు పేర్కొంటున్నారు. డిసెంబరు నెల వేతనాలు సంక్రాంతి పండుగ తరువాత జనవరి 17న జమ చేశారు. ఫలితంగా అతి పెద్ద పండుగను జరుపుకోలేపోయామని తెలిపారు. అలాగే, జనవరి నెల వేతనాలు కూడా ఫిబ్రవరి రెండో వారంలో జమ చేయగా, ఫిబ్రవరి నెల వేతనాలు మార్చి రెండో వారంలో జమ చేశారని పేర్కొంటున్నారు. ఇక, మార్చి వేతనం ఏప్రిల్‌ 2 ఉగాది తరువాత 8వ తేదీ వేశారని, ఏప్రిల్‌ వేతనం మే నెల 12వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకూ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.

విద్యుత్‌ శాఖ సకాలంలో సిబ్బందికి వేతనాలు అందించకపోడంతో సుమారుగా 64 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులపాలవుతున్నారు. ఇందులో మూడు డిస్కంల పరిధలో పనిచేస్తున్న సుమారు 24 వేల మంది ఉద్యోగులతోపాటు మరో 40 వేల మంది వరకూ పెన్షనర్లు ఉన్నారు. అయితే, వీరందరికీ ఈనెల 13వ తేదీ శుక్రవారం వేతనాలు పడితే పడినట్లని ఉద్యోగులు చెబుతున్నారు. శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు కావడంతో ఈ రెండు రోజుల్లో తమ బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమయ్యే పరిస్థితి లేదంటున్నారు. తిరిగి సోమవారం అంటే ఈనెల 16వ తేదీ వస్తుందని, ఈలోగా తమకు ఆర్ధిక ఇబ్బందులు మరితంగా పెరిగే అవకాశముందని అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement