గుంటూరు, ఆంధ్రప్రభ: పాస్ పుస్తకాల కోసం లంచం డిమాండ్ చేసిన గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనాను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఆమె కార్యాలయంలో దాడులు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే..
గుంటూరు మండలం వెంగళాయపాలెం 1, 2 సచివాలయాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా… మహిళా రైతు చెరుకూరి ప్రమీల నుంచి పాస్ పుస్తకాల కోసం రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని ప్రమీల ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.
ఇక పక్కా ప్లాన్ ప్రకారం వీఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను విచారించిన అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. హసీనా గతంలో పనిచేసిన మంగళగిరి ప్రాంతంలో కూడా ఆమెపై ఫిర్యాదులు ఉన్నాయని విచారణలో తేలింది.