న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ కోరారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విడివిడిగా లేఖలు రాసిన శైలజానాథ్ వాటిని బహిరంగంగా విడుదల చేశారు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ద్రౌపది ముర్ముకు మద్ధతిచ్చే విషయంలో రెండు పార్టీలు పోటీపడిన తీరును తప్పుబట్టారు. రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అన్యాయానికి నిరసనగా ముర్ముకు వ్యతిరేకంగా, యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా ఓటేస్తామని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు బహిరంగ ప్రకటన చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని ఈ రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన సూచించారు. ఎనిమిదేళ్లుగా కేంద్రం విభజన హామీలను అమలుచేయడం లేదని, రాష్ట్ర సమస్యలకు జగన్ బానిసత్వమే కారణమని మండిపడ్డారు. జగన్ మౌన ముఖ్యమంత్రిగా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి విజ్ఞాపనలను కేంద్రం చెత్తకుప్పలో పడేస్తుస్తుందో, మరెక్కడ పడేస్తుందో తెలియడం లేదని శైలజానాథ్ అన్నారు. సొంత విషయాలు మాట్లాడుకోవడానికి జగన్‌ను సీఎం చేయలేదని గుర్తుచేశారు. జగన్ కేంద్రం వద్ద సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని కోరారు. వైకాపా, తెలుగుదేశం నాయకులను చూసి ఏపీ ప్రజలు సిగ్గుపపడుతున్నారని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.