Tuesday, November 26, 2024

AP | వాలంటీర్లే నా బలం.. బలగం : జగన్‌

ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ఆయన మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని సీఎం పేర్కొన్నారు.

మీరు వాలంటీర్లు కాదు.. సేవా హృదయాలు అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశంసలు గుప్పించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సిందేనని.. గతంలో ప్రతీ పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు, అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఆర్బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉందని.. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని సీఎం చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని.. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదన్నారు.

- Advertisement -

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్లో పుడితే.. ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టిందని ఆయన అన్నారు. వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడని… బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుందని.. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి.. బాబు ఏదేదో చెప్తాడన్నారు.

మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ” గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలి. మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది. మన పాలనలో లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయి. చంద్రబాబు వస్తే.. చంద్రముఖీలు వస్తాయని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి. 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణం.” అని సీఎం తెలిపారు. ఒక్క జగన్ ఒకవైపు.. మరో వైపు దుష్టచతుష్టయం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement