Sunday, November 17, 2024

Vizianagaram – సస్పెన్షన్ కోసమే టీడీపీ ఓవర్ యాక్షన్ – శాసనసభ ఉపసభాపతి కోలగట్ల

  • విజయనగరం, సెప్టెంబర్ 23: ఎంతో హుందాగా.. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో.. మీసం తిప్పడం, విజిల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవ పరిచారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు మీద రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ ఒక వేదికగా చర్చకు ఉపయోగపడేదని చెప్పారు. ఆ అవకాశాన్ని ఎందుకో గానీ.. టీడీపీ సభ్యులే జారవిడుచుకున్నారని విమర్శించారు
  • శనివారం విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా గమనించారని చెప్పారు. మొత్తంగా సస్పెండ్ అవ్వడం కోసమే టీడీపీ సభ్యులు యాక్షన్ చేశారని.. ఏదో ఒక విధంగా సభ నుంచి వెళ్లిపోవడమే వారి ఉద్దేశమని తెలిపారు. సమావేశాలు ప్రారంభమై నిమిషమైనా కాకముందే.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళ పరిచారన్నారు. సభాపతిని కొట్టేంత పని చేశారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ మీద చర్చ కోరకుండా.. ఆయన మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని అరవడం ఎంత వరకూ సబబని.. అసలు సభాపతికి ఆ హక్కు ఉంటుందా? అని ప్రశ్నించారు. సమావేశాల్లో విశ్లేషణ చేస్తూ, చర్చించాల్సిన అంశాన్ని వారే దుర్వినియోగం చేశారని.. బహుశా వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా, చంద్రబాబును జైల్లో ఉంచడమే టీడీపీ వారికి ఇష్టమేమోనని అనుమానం వ్యక్తం చేశారు. విషయాన్ని పక్కదోవ పట్టించాలన్నదే వారి ఉద్దేశంలా ఉందన్నారు.
  • తమ సభ్యులు రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు వంటి వారు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి స్పష్టంగా వివరించారని, చర్చిద్దాం రండి అని పిలిస్తే.. చంద్రబాబు నిప్పు అనుకొనే వ్యక్తులు ఎందుకు దాన్ని చెడగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ అకౌంట్ లు చూసుకునే గంటా సుబ్బారావుకు స్కిల్ డెవలప్మెంట్ లో బాధ్యతలు అప్పగించలేదా? అని ప్రశ్నించారు. “అచ్చెన్న వంటివారు జగన్ మీద విమర్శలు చేస్తున్నారు.. పోనీ, మా ముఖ్యమంత్రి బెయిల్ మీద వచ్చారు. మీకు సత్తా ఉంటే చంద్రబాబు నిప్పు, నిజాయితీపరుడు, కడిగిన ముత్యం అని నిరూపించుకోండ”ని సవాల్ చేశారు. మిగిలిన మూడు రోజుల సమావేశాలనైనా అందుకు వినియోగించుకోవాలని హితవు పలికారు. వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం

కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, దివంగత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని టీడీపీలోకి చేరిన చంద్రబాబు..‌ చివరకు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని కోలగట్ల విమర్శించారు. చివరికి కుటుంబ సభ్యులైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ లను ఏం చేశారో అందరికీ తెలుసని.. కొడుకు భవిష్యత్తుకు అడ్డు వస్తాడన్న కారణంతో జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేశాడని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రికి దాసోహమై, విభజన చట్టంలోని హక్కును సుమారు 8 ఏళ్లు కోల్పోయేలా చేశాడని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. స్టేలన్నీ ఎత్తివేయించి విచారణ జరిపించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు తామే సెహభాష్ చంద్రబాబు అంటామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ వెన్నుపోటుకు అశోక్ భాగస్వామి..

చంద్రబాబు అరెస్టును రాజకీయ స్టంట్ కోసమే టీడీపీ హడావిడి చేస్తోందని కోలగట్ల విమర్శించారు. వారు పాదయాత్ర చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పోలీస్ వారి అనుమతి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుందన్నారు. ఇంట్లో కూర్చుని జిల్లాకు చెందిన అశోక్ గజపతి విమర్శలు చేస్తుంటారని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ వారిది కాదని ఆయన చెప్పగలరా? అని డిమాండ్ చేశారు. వెన్నుపోటు కుట్రలో అశోక్ కూడా భాగస్వామేనని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఇది ఓర్వ లేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement