విజయనగరం: కొన్ని దశాబ్దాలుగా మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్న క్షయ మహమ్మారిని కలిసికట్టుగా తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. భావితరాలు క్షయ వ్యాధి బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ధూమపానం అనే అలవాటుకు ప్రజలందరూ దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎం & హెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా క్షయ వ్యాధి కోసం మాట్లాడుకోవటం నిజంగా దురదృష్టకరమని, ఈ మహమ్మారిని దరి చేరనీయకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది క్షయ వ్యాధిపై క్షేత్రస్థాయిలో విరివిగా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక సదస్సులు పెట్టడం ద్వారా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమలు ఉండే ప్రాంతాల్లో వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వ్యాధి 20 శాతం తగ్గుముఖం పట్టడం నిజంగా శుభపరిణామని పేర్కొన్నారు. టీబీ కంట్రోల్ విభాగం అధికారులు చేపడుతున్న చర్యలు ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. వైద్యులు, సిబ్బంది బాధ్యతగా ఉంటూ అంకిత భావంతో పని చేసి మరిన్ని ఆశాజనక ఫలితాలు సాధించాలని నిర్దేశించారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిర్దారణ అయినట్లయితే తప్పకుండా మందులు వాడాలని, నిర్లక్ష్యంగా ఉండరాదని పేర్కొన్నారు. మంచి ఆహారపు అలవాట్లను కొనసాగించాలని చెప్పారు. తప్పకుండా మాస్కు ధరించాలని, శానిటైజ చేసుకోవాలని సూచించారు. ఎవరూ కూడా ధూమపానం జోలికి పోరాదని హితవు పలికారు. వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడే కన్నా.. వ్యాధి సోకక ముందే నివారణా చర్యలు పాటించటం శ్రేయస్కరమని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందికి జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు.