ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఊళ్లన్నీ మాయం
రికార్డుల్లో నుంచి తొలగిపోయిన గిరిజన గ్రామాలు
వాటిని ఎందుకు మాయం చేస్తున్నారో చెప్పాలి
గతంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 792 గ్రామాలు
ప్రస్తతం 292కు మాత్రమే పరిమితం
గిరిజనేతరులకు భూ హక్కుల కోసమేనా?
పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలన్న ధర్మాసనం
కేంద్ర గిరిజ సంక్షేమ శాఖ కార్యదర్శికి ఆదేశాలు
లేకుంటే తదుపరి చర్యలుంటాయని స్పష్టత
సెంట్రల్ డెస్క్, ఆంద్రప్రభ: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు మండలాల పరిధిలోని షెడ్యూల్డ్ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. షెడ్యూల్డ్ ఏరియాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
గిరిజన హక్కుల పరిరక్షణకు..
విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా హద్దులను గిరిజనేతరులకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకటశివరాం 2023లో హైకోర్టులో పిల్ వేశారు. షెడ్యూల్డ్ ఏరియా హద్దులను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్యాంసుందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతరులకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.
సమాచారహక్కుచట్టమే ప్రధానాస్త్రం..
సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం మేరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలున్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి చేరిందన్నారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పొన్నారావును ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. తమ ముందు పూర్తి వివరాలతో నివేదిక ఉంచాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.