కోవిడ్ చికిత్స కోసం అదనపు పడకలు ఏర్పాటుకు చేసేందుకు విశాఖ స్టీల్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ సీఎండీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. 850 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్‌ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. 2013లో ఈ ప్లాంట్ పూర్తైనప్పటికీ కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో గతంలో సంప్రదింపులు పూర్తి కాలేదని ఆర్‌ఏఎన్‌ఎల్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం సంప్రదింపులు పూర్తైన దృష్ట్యా 6 నెలల్లో ప్లాంటు అందుబాటులోకి వస్తుందని స్టీల్ ప్లాంట్ అధికారులు స్పష్ట చేశారు. వారం రోజుల్లో ప్లాంట్ స్ధితిగతులపై కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక బృందం అధ్యయనం చేయనుంది. ఈ ప్లాంట్ సందర్శనకు నావల్ డాక్‌యార్డు అధికారులు అంగీకరించారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ అందుబాటులోకి రానప్పటికీ భవిష్యత్తు అత్యవసరాలకు ఈ ప్లాంట్ గణనీయంగా ఉపయోగపడుతుందని ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులు చెప్పారు.
గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్ తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ చెప్పారు. మే 30 నాటికి 250 పడకలు, జూన్ 2021 నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్ ప్లాంటు అధికారులు వివరించారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ స్టాప్‌ను అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు కోరారు. నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్ ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.