విశాఖలో రెమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ దందా ఆగడం లేదు. బ్లాక్ లో అడ్డగోలుగా భారీగా ధరలకు ఇంజెక్షన్లను అమ్ముతున్నారు. ఒక్కో ఇంజెక్షన్ రూ. 35 వేల చొప్పున ఆరు వయల్స్ రూ. 2,10,000 అమ్మకాలు చేశారు. రెమ్ డెసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందాపై డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు బ్లాక్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రాకేష్, బ్రహ్మాజీ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఆరు ఇంజక్షన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కంట్రోలర్ అధికారులు కళ్యాణి, సునీత నిఘా పెట్టి నిందితులను పట్టుకున్నారు. అనంతరం నిందితులను ఎంవీపీ పోలీసులకు డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్పగించారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ రెమిడిసివర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టాయి. బయటి వ్యక్తులకు అమ్ముతూ ఇద్దరు ఆసుపత్రి సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక నర్స్, అంబులెన్స్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.