Friday, November 22, 2024

నడిసంద్రంలో గ్యాంగ్ వార్.. దాడులకు తెగబడ్డ మత్స్యకారులు

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌) : ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా నిలిచిన విశాఖ సాగరతీరం మధ్యలో మత్స్యకారుల మధ్య భారీగా కొట్లాట జరిగింది. సముద్రం మధ్యలో రెండు వర్గాల మధ్య భారీగా కొట్లాట జరిగింది. సినిమాల్లో మాదిరిగా ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసేందుకు బోట్లుకు బోట్లు ఒడ్డునుంచి బయలుదేరి వెళ్లాయి. రింగువలలతో వేట సాగిస్తున్న మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారుల మధ్య ఈ కొట్లాటలు జరగడం, ఆరు బోట్లు దగ్ధం కావడం, పలువురికి తీవ్ర గాయాలు నెలకొనడం, ఆసుపత్రికి తరలింపు, తదుపరి పలు మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దీంతో అనేక ప్రాంతాల్లో పోలీస్‌ పికిటింగ్‌లు ఏర్పాటు చేసి పలు గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించారు. మత్స్యకారుల మధ్య భారీగా కొట్లాట జరగడంతో ఒక్కసారిగా సముద్రంలో ఉద్రిక్తంగా మారింది.

విశాఖలో చాలా కాలం నుంచి రింగువలలుతో వేట సాగిస్తున్న మత్స్యకారులు, సాంప్రదాయ బద్దంగా వేటసాగిస్తున్న మత్స్యకారుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరువర్గాలుతోనూ ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత పలు సందర్భాల్లో పెద్దలు సైతం రాజీ కుదిర్చిన తరచూ ఈ వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మంగళవారం ఉదయం జాలారిపేట, మంగమారిపేటలో మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే సాంప్రదాయ మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు మత్స్యకారులు రింగువలలతో వేట సాగిస్తుండడాన్ని గమనించారు. దీంతో అక్కడ వివాదం నెలకొంది. చట్టప్రకారం రింగువలలతో వేట సాగించరాదని ఎక్కడా లేదని ఒక వర్గం మత్స్యకారులు వాదిస్తున్నారు. అయితే రెండో వర్గం మత్స్యకారులు మాత్రం రింగు వలలు ఉండి తగిన అనుమతులు ఉన్నవారు 8 నాటికల్‌ మైళ్లు అవతల సముద్రంలో వేట సాగించుకోవచ్చునని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే కొందరు రింగువలలతో అధికారులు అనుమతి తీసుకొని వేటకు బయలుదేరి వెళ్లారు.

అయితే జాలారిపేటకు చెందిన కొంత మంది మత్స్యకారులు రింగువలలతో వెళ్లిన వారు నిబంధనలు ప్రకారం 8 నాటికల్‌ మైళ్ల అవతల వేట సాగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తామని చెప్పి సముద్రంలోకి వెళ్లారు. అయితే సముద్రంలోకి వెళ్లాక పరిస్థితి మారిపోయింది. నిబంధనలు ప్రకారం వేట సాగించడం లేదని సాంప్రదాయ మత్స్యకారులు రింగువలలతో వేట సాగించిన వారితో కొట్లాటకు పాల్పడ్డారు. తొలుత తిట్లు, దుర్భాషలతో ప్రారంభం కాగా, తరువాత వివాదం ముదిరి రింగువలలుతో వేట సాగించిన మత్స్యకారులకు చెందిన ఓజాబోటును తగలబెట్టారు. తరువాత దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలోనే పెదజాలారిపేట, రేసపువానిపాలెం, ఎండాడ, భీమిలి మంగమారిపేటతో పాటు సాగరతీరం పొడవున ఉన్న మత్స్యకారుల్లో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొన్నాయి. సముద్రంలో సుమారు ఆరు బోట్లు తగలబెట్టినట్లు తెలుస్తుంది. ఇవన్నీ రింగువలలతో వేట సాగించిన వారివేనని చెబుతున్నారు. మరో వైపు సాంప్రదాయ మత్స్యకారుల్లో కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇరు వర్గాలు ఏ మాత్రం తగ్గకుండా కొట్లాటలతో పాటు దాడులకు తెగబడ్డారు. కొందరు ఆయుదాలుతో సైతం బోట్లపై సముద్రంలో గొడవకు దిగారు. ఒక దశలో పోలీసులు సైతం నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. లా అండ్‌ ఆర్డర్‌, మెరైన్‌ పోలీసులు కలిసి అదుపు చేసేందుకు ప్రయత్నించినా పూర్తిస్థాయిలో వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. మరో వైపు తమ బోట్లు పోయాయని సాంప్రదాయ మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మత్స్యకార గ్రామాల్లో పరిశీలించి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మత్స్యకారులు ఎవరి మాట వినలేదు. సాయంత్రం వరకు వివాదం నడుస్తుంది. మరో వైపు ఈ వివాదం గ్రామాల మద్యకు కూడా పాకింది. పరిస్థితిని అదుపు చేసేందుకు కోస్ట్‌ గార్డ్‌ హెలికాప్టర్‌ను రంగంలోకి దించగా , నేవీ బృందాలు వివాదం జరిగిన సముద్రతీర ప్రాంతంలోకి బయలుదేరి వెళ్లాయి.

అయితే రింగువలలతో వేట సాగించడం వల్ల తమ జీవనోపాది కోల్పోతున్నామని సాంప్రదాయమత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నెల రోజుల పాటు సాగించే వేట రింగువలల మత్స్యకారులు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారని, దీని వల్ల మత్స్య సంపద కూడా తీవ్రంగా మృత్యువాత పడుతుందన్నారు. ఏది ఏమైనా నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొనడం, అందుకు విశాఖ సాగరతీరం వేదిక కావడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

పోలీస్‌ పికిటింగ్‌లు, 144 సెక్షన్‌

ఈ నేపధ్యంలోనే వివాదం చోటు చేసుకున్న జాలారిపేట, రేసపువానిపాలెం, ఎండాడ ప్రాంతాలను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రింగువలల వివాదం చాలా కాలం నుంచి కొనసాగుతుందన్నారు. సముద్రం లోపల రింగువలల మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారుల మధ్య వివాదం చెలరేగడంతో తొలుత పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారన్నారు. సుమారు 5 నుంచి 6 గంటల పాటు సాంప్రదాయ మత్స్యకారులు కొన్ని బోట్లు తగలబెట్టినట్లు గుర్తించామన్నారు. దీనిపై మెరైన్‌ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అయితే గ్రామాల్లో ఎటువంటి లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేకుండా 144 సెక్షన్‌ విధించామని, ఆరు ప్రాంతాల్లో పోలీసు పికిటింగ్‌లు ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. గతంలో ఈ వివాదంపై అనేకసార్లు చర్చలు జరిగాయని, త్వరలోనే సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా రేసపువానిపాలెం, జాలారిపేటల్లో 144 సెక్షన్‌ విధించినట్లు తహసిల్ధార్‌ జ్ఞానవేణి తెలిపారు. రింగువలలకు చెందిన వారి ఆరు బోట్లను సాంప్రదాయ మత్స్యకారులు కాల్చివేశారన్నారు. ఇందుకు సంబంధించి రుషికొండ మెరైన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement