Friday, November 22, 2024

Exclusive | మిస్టరీ వీడని వివేక మర్డర్​.. సీక్రెట్​ విట్​నెస్​గా షర్మిల, సునీత వాంగ్మూలం ఏంటంటే!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ‘సీక్రెట్​ విట్​నెస్​’గా వైఎస్ షర్మిలను సీబీఐ ప్రొడ్యూస్​ చేసింది. వైఎస్​ వివేకా, అవినాష్ రెడ్డి కుటుంబాలకు మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె సీబీఐ ముందు ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వివేకానంద ఒప్పుకోలేదని ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల సీబీఐకి తెలిపారు. ఇక.. వివేకా కూతురు సునీత కూడా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు ఇందులో జగన్​ భార్య భారతి, సజ్జల పేర్లను ప్రస్తావించారు. వారు తనను తప్పుడు సమాచారం ఇచ్చేలా ప్రేరేపించారని సీబీఐకి తెలిపారు..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మాజీ ఎంపీ, వైఎస్​ వివేకానందరెడ్డి మర్డర్​కి సంబంధించిన పలు విషయాలను షర్మిలా సీబీఐకి వెల్లడించినట్టు సమాచారం. హత్యకు రెండు నెలల ముందు వివేకానంద తన ఇంటికి వచ్చి కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలని పట్టుబట్టారని, 2009లో నాన్న (మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి) మరణానంతరం అన్న జగన్​ కోసం ఎక్కువగా ప్రచారం చేయడంతో మొదట్లో తాను అంగీకరించలేదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, వివేకానంద తన నుండి ‘నో’ అనే మాట వినడానికి సిద్ధంగా లేడని, అతని ప్రతిపాదనను తాను అంగీకరించాలని పట్టుబట్టాడని తెలిపారు. చివరికి తాను అతని మాటలకు కాదనలేక సరే అని చెప్పినట్టు షర్మిల సీబీఐకి తెలిపారు.

ఇక.. ఇంతలా తనను రిక్వెస్ట్​ చేయడం వెనుక కారణం ఏమిటని వివేకానందను ప్రశ్నించగా అప్పుడు దీనికి గల కారణాలను వెల్లడించినట్టు తెలిపారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి వంటి సన్నిహితులు తనను మోసం చేశారని వివేకా తనకు చెప్పినట్టు స్పష్టం చేసింది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయారు. కడప టిక్కెట్టు వైఎస్‌ అవినాష్‌కు ఇవ్వాలని తన సోదరుడు వైఎస్‌ జగన్‌ యోచిస్తున్నారని తెలుసుకున్న ఆయన.. ఆ ఎన్నికల్లో పోటీ కోసం టిక్కెట్ ఇవ్వకపోవచ్చని భావించారని షర్మిల తెలిపారు. షర్మిల వాంగ్మూలం ప్రకారం.. వివేకానందరెడ్డికి ఇద్దరు భార్యలున్నారని, అందులో వైఎస్ అవినాష్ రెడ్డి ఒకరితో కుటుంబ నేపథ్యం ఉందని సమాచారం. వివేకానంద రెడ్డి హత్య వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని, వ్యక్తిగత శత్రుత్వం లేదని షర్మిల సీబీఐకి తెలిపారు. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డిని 2019, మార్చి 15న మర్డర్​కి గురయ్యారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏడో నిందితుడిగా చేర్చింది.

- Advertisement -

సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కూతురు సునీత
ఏం చెప్పిందంటే..

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన కూతురు సునీత సంచలన విషయాలను వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను ఆమె ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. తన ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని… తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు. ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి వెంటనే తన ఇంటికి వచ్చారని చెప్పారు. అయితే ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. లిఫ్ట్ వద్దే భారతితో తాను మాట్లాడానని, ఆ సమయంలో భారతి చాలా ఆందోళనగా కనిపించారని చెప్పారు.

నాన్న చనిపోయిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చినందున భారతి బాధగా ఉన్నారని తాను అనుకున్నానని సునీత చెప్పారు. అయితే, ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని తనతో భారతి చెప్పారని సునీత తెలిపారు. హత్య గురించి మీడియాతో మాట్లాడాలని సజ్జల తనతో చెప్పారని… ఆయన ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు అక్కడున్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియోను పంపించానని తెలిపారు. అయితే, వీడియో పంపించడం కాదు, ఈ వివాదానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారని… జగనన్నతో పాటు అవినాశ్ పేరును కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారని చెప్పారు. అప్పటి వరకు తాను ఎక్కడా అవినాశ్ పేరును ప్రస్తావించలేదని… అవినాశ్ పేరును ప్రస్తావించాలని చెప్పినప్పుడు కొంత సంకోచించానని తెలిపారు.

అవినాశ్ రెడ్డికి కడప ఎంపీ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదని సునీత చెప్పారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు ఉన్నాయని తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాదులో తాను ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తొలి నుంచి అడుగుతున్నానని అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని… ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని చెప్పారు. పొరపాటు జరిగిందనే విషయం తనకు తెలుసని… క్రిమినల్ మైండ్ ఎలా పని చేస్తుందో మాత్రం అర్థం చేసుకోలేదని అన్నారు.

మార్చురీ బయట ఉన్నప్పుడు ఒక ఫిర్యాదును రాసుకొచ్చి సంతకం చేయమన్నారని సునీత తెలిపారు. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని, టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాశ్ తనతో అన్నారని చెప్పారు. ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని వెల్లడించారు.

2019 జులైలోనే అవినాశ్ పై తనకు అనుమానం మొదలయిందని సునీత తెలిపారు. వివేకా మృతి విషయం తన కుమారుడికి ముందే తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని… అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. వైఎస్ భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సీబీఐకి సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement