Friday, November 22, 2024

Viveka Case – చంద్ర‌బాబు ద‌ర్శ‌క‌త్వంలోనే సిబిఐ విచార‌ణ – స‌జ్జ‌ల‌

అమరావ‌తి – కేవలం రాజకీయ‌ కోణంలోనే వివేకా హ‌త్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న‌ద‌ని, ఆస్తి, కుటుంబ వ్యవహారాల కోణాల్లో విచారణ జరగడం లేదని ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. వివేకా హత్య రాజకీయ కోణం ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా ఆ విషయం చెబుతారని తెలిపారు. తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కొందరు జడ్జిల నిర్ణయాలపైనా కామెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. నిజాయితీపరులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. న్యాయస్థానాలు టీడీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే అమ్ముడుపోయినట్టా అని నిలదీశారు. న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని ఛానెళ్లలో తప్పుడు కథనాలు వస్తున్నాయని సజ్జల ఆరోపించారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసే యత్నం చేస్తున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కొన్ని ఛానెళ్లు రాజకీయ పార్టీలకు అజెండా సెట్ చేస్తున్నాయన్నారు. దర్యాప్తుకు సంబంధించిన అంశాలు వారికి ఎలా తెలుస్తున్నాయని సజ్జల ప్రశ్నించారు. తమ అజెండాతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయన్నారు. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలని తెలిపారు. ప్రజా జీవితాల్లో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ చర్చలు పెడుతున్నారని అన్నారు..
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని.. వైఎస్ జగన్ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అన్నారు. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్ ఆహ్వానించారని సజ్జల తెలిపారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్‌దే తుది నిర్ణయమన్నారు. వివేకా హత్యలో పొలిటికల్ అంశమే లేదన్నది స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement