అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని దత్తత గ్రామాల్లో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం మూడో వార్షిక ఉచిత వేసవి క్రీడా శిబిరాలను ప్రారంభించింది. వీఐటీ దత్తత గ్రామాలైన ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాల్లోని ఉచిత వేసవి క్రీడలను శనివారం తుళ్లూరు మండల విద్యాశాఖ అధికారి గద్దె కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సమస్యల పరిష్కారినికి దోహదపడుతుందన్నారు. ఇదే సమయంలో సమిష్టితత్వం అలవడుతుందని చెపుతూ ప్రస్తుత కాలంలో ఇది ఎంతైనా అవసరమన్నారు. వేసవి క్రీడా శిబిరాలు తమ దత్తత గ్రామాల్లోని విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తున్నట్లు చెప్పారు.
శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయం వ్యాయామ, క్రీడల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, యోగా, అథ్లెటిక్స్, త్రోబాల్, కరాటే, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 7గంటల నుంచి గంటన్నర పాటు సాగే ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కలిపించినట్లు నిర్వహకులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమ విభాగం డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అనుపమ నంబూరు మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరంలో 407మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తాము నిర్వహించిన శిక్షణా శిబిరాల ద్వారా 1727మంది విద్యార్థులు లబ్దిపొందారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, ట్రైనర్ కార్తీక్ ప్రకాష్, కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.