అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు
టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి
తిరుమల : శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు…
- దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు.. కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
- చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.
- భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
- గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
- భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
- మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
- 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.