Monday, July 1, 2024

Vishakhaptnam – రాజీనామా చేసినా వీసీని వదిలిపెట్టం – ఎంపి సిఎం రమేష్….

విశాఖ‌ప‌ట్నం : ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం రమేశ్ ధ్వ‌జ‌మెత్తారు. వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా చేసినా ఏయూలో జరిగిన అక్ర‌మాల‌పై ద‌ర్యాప్తు చేయిస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఈ అక్ర‌మాల‌పై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. రాజీనామా చేసినప్పటికీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ రాజీనామాల నేపథ్యంలో పూర్వ విద్యార్థులు వర్సిటీకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ ద‌క్ష‌ణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాద‌వ్ త‌దిత‌రులు వర్సిటీకి చేరుకుని పరిశీలించారు. వర్సిటీకి వచ్చిన నేతలకు ఏయూ విద్యార్థులు, పరిశోధకులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ.. ఆంధ్రా యూనివర్సిటీ నుంచే వైసీపీ కార్యకలాపాలు నడిచాయని ఆరోపించారు. ఏయూ వైసీపీ కార్యాలయంగా మారిందని విమర్శించారు. ఇక్కడ జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ జరుపుతామని తెలిపారు. వర్సిటీలోని వైఎస్‌ విగ్రహం తొలగించడం తమకు పెద్ద పనేమీ కాదని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ, విద్యార్థి సంఘాల అభిప్రాయం మేరకే దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏయూ ప్రతిష్ఠను మాజీ వీసీ ప్రసాదరెడ్డి దెబ్బతీశారని మండిపడ్డారు.

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రా యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. వర్సిటీలో వైఎస్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. అడ్డగోలుగా పదవులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామన్నారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా రాజకీయాలు చేస్తామన్నా చంద్రబాబు ఊరుకోరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement