విశాఖపట్నం – సమకాలీన రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ కి ఎవరూ సాటి లేరని మెగాస్టార్ చిరంజీవి కొనియాడాడు. యండమూరి రాసిన ‘అభిలాష’ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాతోనే సినీ పరిశ్రమలో తన స్థానం సుస్థిరమయిందని చెప్పారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకు ఉండదని… అందుకే ఆ బాధ్యతను యండమూరికి అప్పగిస్తున్నానని తెలిపారు. లోకనాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాలను రచయిత యుండమూరి వీరేంద్రనాధ్ కు ప్రదానం చేశారు మెగాస్టార్..
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యండమూరి నవలలు చదివితే యువతకు ఆలోచన, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీ పరిశ్రమకు రెండు కళ్లువంటి వారని అన్నారు. ఇద్దరూ తనకు దైవ సమానులని… తనకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని చెప్పారు. వారితో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. వారితో తనకున్న అనుభవాలను మర్చిపోలేనని చెప్పారు.
ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లకు నిజమైన వారసుడు చిరంజీవే …
ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి నిజమైన వృత్తి వారసుడు మెగాస్టార్ చిరంజీవియే అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ.. మెగాస్టార్ చిరంజీవి వలన తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ప్రశంసలు కురిపించారు. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలని అంకురార్పణ చేసింది మాత్రం ఎన్టీఆరే అని గుర్తుచేశారు. ఇక, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు