విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో – కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, మిగిలిన పార్టీలుతో ఒరిగింది ఏమీ ఉండదు అని
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, బీజేపీ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని ఏద్దేవా చేశారు,
న్యాయ్ యాత్ర పేరిట అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ కూడలిలో షర్మిల ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ, .విశాఖ అభివృద్ధికి ఈ ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసింది శూన్యమని దెప్పి పొడిచారు. ఇప్పటి కే ఉత్తరాంద్ర ను దోచుకొని, దాచుకున్నారన్నారు.. విశాఖ కు చేసిందేమీ లేదని, విలువైన భూములు వైసీపీ నేతల గుప్పిట్లో ఉంచుకున్నా రన్నారు… మరో సారి అవకాశం ఇస్తే విశాఖ ను పూర్తిగా అమ్మేస్తారన్నారు…బలిదానాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తుంటే ఇక్కడి ఎంపీ ఒక్కసారైనా పోరాడారా అని ప్రశ్నించారా అంటూ నిలదీశారు. ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావాలని షర్మిల స్పష్టం చేశారు.
ఇంతకుముందు మీరు ఓట్లేసిన వారు ఇప్పటి వరకు ఏం చేశారో ఓ సారి గుర్తు చేసుకోండంటూ ప్రజల్ని అడిగారు. దివంగత వైఎస్ 30ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంగవరం పోర్టు ఏర్పాటు చేస్తే వైసీపీ హయాంలో కేవలం 6వేల కోట్లకే అమ్మేశారంటూ మండిపడ్డారు. సొంతగనుల్లేక విశాఖ ఉక్కు అల్లాడిపోతోందని, అప్పట్లో వైఎస్ అనంతపురంలో బొగ్గు గనుల్ని నిల్వ ఉండేలా చేశారని గుర్తు చేశారు.
ఐదేళ్ల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ధరల స్థీరీకరణ, మద్యపాన నిషేధం వంటివి పూర్తి చేయకుండానే వైసీపీ మళ్లీ మరో మేనిఫెస్టో ఇచ్చిందని, అదీ అంతేనని షర్మిల ఎద్దేవా చేశారు. ఉద్యోగాల్లేవని, జాబ్ క్యాలెండర్ తుస్సయిందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం మన నేతలు అప్పాయింట్‌మెంట్ అడిగినా మూడేళ్లు జగన్ ఇవ్వలేదని, ఆ తర్వాత కలిస్తే స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉందా అంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు. ఆస్తులు అమ్ముకోండని చెప్పడంపై ఈయనేం ముఖ్యమంత్రి అని అన్నారు.
ఎన్‌ఎండీసీ కూడా ముడిసరకు సరఫరా చేయడం లేదని, స్టీల్‌ప్లాంట్ కాళ్లు, చేతులు వైసీపీ నరికేస్తోందన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టేశారంటూ చంద్రబాబు తీరుపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలంటూ త్రీడీ బొమ్మ చూపిస్తే మూడు రాజధానులంటూ జగన్ ఏకంగా సినిమాయే చూపించేశారని ఆరోపించారు. ఏపీకి చివరికి మిగిలింది చిప్పేనని, నెత్తిపై టోపీయేనన్నారు. వైఎస్ 66నీటి పారుదల ప్రాజెక్టులు ప్రారంభించి 14పూర్తి చేస్తే జగన్ 44ప్రాజెక్టులపై కనీసం దృష్టి సారించలేకపోయారన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలూ బీజేపీకి తొత్తులేనని, ఏపీలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తోందని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా ద్వారా కొత్త పరిశ్రమలొచ్చి ఉపాధి లభిస్తుందంటూ ఆ పార్టీ మేనిఫెస్టోను వివరించారు.
గద్దర్ శిష్యుడు సత్యారెడ్డి ..
విశాఖ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సత్యారెడ్డి గద్దర్ శిష్యుడంటూ ఆయన సేవల్ని షర్మిల కొనియాడారు. పోరాటాలు చేస్తున్న సత్యారెడ్డితో పాటు ఇండియా కూటమిలోని సీపీఐ, సీపీఎం నేతల్ని అసెంబ్లీకి పంపించి విశాఖ పరువును కాపాడుకుందామన్నారు.
సత్యారెడ్డి మాట్లాడుతూ మండుటెండలోనూ జనవర్షం కనిపించిందని, విశాఖ ఉక్కుతో పాటు ఆంధ్రుల హక్కుల్నీ కాపాడుకుందామన్నారు. అవసరమైతే జైలుకెళ్తామన్నారు. గాజువాక, పెందుర్తి, విశాఖ ఉత్తర, దక్షిణం, బీజేపీ, ఎస్‌కోట, తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి నేతలు జగ్గునాయుడు, విమల, రామారావు, సంతోష్, డాక్టర్ తిరుపతిరావుతో పాటు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ నరసింగరావు, జేవీ సత్యనారాయణ మూర్తి (నాని), స్థానిక నేతలు పాల్గొని ప్రసంగించారు.