—కేంద్రం అన్నివిధాలా సహకరించేందుకు సిద్ధం
—రాజకీయ గొడవలు, పంతాలు, పట్టింపులను వదిలిపెట్టండి
—కలిసికట్టుగా పనిచేయండి… ప్రజల ఆకాంక్షలను నెరవేర్చండి
—-వైజాగ్ ‘‘రోజ్ గార్ మేళా’’లో మంత్రి బండి సంజయ్
(విశాఖపట్నం- ఆంధ్ర ప్రభ బ్యూరో) : కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ పాలన కొనసాగుతున్నందున గతంతో పోలిస్తే ఏపీని రెట్టింపు స్థాయిలో అభివ్రుద్ది చేసుకునే అవకాశాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాజకీయాలను, పంతాలు, పట్టింపులను పక్కనపెట్టి అభివ్రుద్ధికి సహకరించాలని, తద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా తన చేతుల మీదుగా 110 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ భరత్, స్థానిక మేయర్ హరి వెంకట కుమారి , ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో అనేక ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలున్నందున పర్యాటక రంగంగా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు, ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా అహర్నిశలు పనిచేస్తున్న మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు.
మోదీ కృషి ఫలితంగా ఆర్ధిక ప్రగతిలో భారత్ 5వ స్థానానికి చేరుకుందన్నారు. 2028 నాటికి భారత్ మూడో స్థానానికి చేరుకోవడం తథ్యమన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతోందని, ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మోదీ ఆలోచనల మేరకు, వారి కృషి వల్ల అనేక మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ధ్రుఢ సంకల్పంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారని తెలిపారు.
అందులో భాగంగా వైజాగ్ లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోదీ ప్రకటించారన్నారు. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 8 లక్షల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చామన్నారు బండి .
పైరవీలకు తావు లేదని, . నోటిఫికేషన్ల పేరుతో జాప్యం చేయడం లేదని అంటూ. అవినీతి ఆరోపణలు లేకుండా నిర్ణీత గడువులోగా రిక్రూట్ మెంట్ నిర్వహించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తున్నామన్నారు.. ఏ విభాగంలోనైనా ఖాళీలుంటే ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటూ ఆ పరిస్థితి రాకూడదనే వెంటవెంటనే భర్తీ చేస్తున్నామన్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచ ఆర్దిక ప్రగతిలో మనదేశం 11వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు.. మోదీ అద్బుతమైన పాలనా దక్షతవల్ల ఇయాళ 5వ స్థానంలోకి అడుగుపెట్టామన్నారు.. మరో 4 ఏళ్లలో అంటే 2028 నాటికి ఆర్ధిక ప్రగతిలో భారత్ మూడో స్థానానికి చేరుకుని అమెరికా, చైనాతో పోటీ పడతామని ధీమా వ్యక్తం చేశారు.
‘‘ఆత్మనిర్బర భారత్’’ అంటే మన దేశం అన్ని రంగాల్లో స్వయం సమ్రుద్ధి సాధించడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడటమే. కరోనాతో ప్రపంచమంతా వణికిపోయింది.అమెరికా వంటి అగ్రదేశం కూడా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజలు ఆర్దికంగా చితికిపోయారు. కానీ మోదీ దూరద్రుష్టితో ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసింది. ఏ వర్గాలైతే ఉద్యోగాల కోసం అర్రులు చాచాయో… ఆ వర్గాలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని స్టాండప్ ఇండియా ఏర్పాటు చేశారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇండియా పేరుతో వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, ఈ కామర్స్, ఎంఎస్ఎంఈ, సాంప్రదాయ ఇంధన, సేవా రంగాల్లో అగ్ర దేశాలతో పోటీ పడేలా దూసుకుపోతున్నమన్నారు.
మోదీ రి విజన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. మన దేశ జనాభాకు సరిపడ వడ్లు పండించడంతోపాటు విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నామన్నారు కేంద్ర మంత్రి . ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారిందని, ఒకప్పుడు చక్కెర దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసుకునే వరకు వెళ్లినామని తెలిపారు. .
గతంలో జన్ ధన్ ఖాతాలను ప్రారంభిస్తే…చదువురాని వాళ్లతో బ్యాంకు అకౌంట్లు ప్రారంభిస్తే ప్రయోజనం ఏముందని హేళన చేశారన్నారు బండి సంజయ్. కానీ సంక్షేమ పథకాల లబ్ది నేరుగా వారికే ఆ ఖాతాలో ద్వారానే అందుతున్నాయన్నారు.
ఎపికి భారీగా నిధులు
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా దాదాపు రూ.13,500 కోట్లు కేంద్రం ఇప్పటి వరకు మంజూరు చేసిందని బండి సంజయ్ చెప్పారు. అమరావతి డెవలెప్ మెంట్ కోసం రూ.15000 కోట్లు ఇవ్వబోతున్నామని అన్నారు. ఇప్పటికే 3 వేల కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు..
కేంద్ర భాగస్వామ్యంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోబోతున్నమన్నారు. . భూసేకరణ అయ్యే ఖర్చులో కేంద్ర రాష్ట్రాలు సగం సగం భరించాలని చెప్పారు… కానీ రాష్ట్ర పరిస్థితి ద్రుష్ట్యా పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు. కొత్తగా రూపు దిద్దుకుంటున్న విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ ప్రెస్ హైవేతే వైజాగ్ రూపరేఖలే మారతాయన్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం -కొవ్వూరు, కాళహాస్తి-నడికుడి, కోటిపల్లి-నర్సాపురం, రాయదుర్గం- రాయచూర్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులిస్తోందని చెప్పారు.
విమానయాన రంగం విషయానికొస్తే…. ఆ శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే కావడంవతో . భారీ ఎత్తున విమానాశ్రయాల అభివ్రుద్ధికి క్రుషి చేస్తున్నారని చెప్పారు.. తిరుపతి, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివ్రుద్ధి చేసే పనిలో ఉన్నారన్నారు.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతి లభించిందని అంటూ, . విమానాశ్రయాల్లో మౌలిక వసతుల కోసమే వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసినామన్నారు.. స్మార్ట్ సిటీ పథకం కింద విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి నగరాల అభివ్రుద్ధి కోసం దాదాపు 8 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు మంజూరు చేసిందని చెప్పారు. మొన్నటి కేబినెట్ లోనే మొన్ననే అమరావతి మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి 2వేల 200 కోట్ల నిధులు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.