Friday, November 22, 2024

AP : విశాఖపట్నం మూగజీవాల విశోకం… జూలో ఆగని అకాల మరణాలు

విశాఖ ఇందిరాగాంధీ జంతుప్రదర్శన శాలలో అరుదైన జాతులకు చెందిన మూగ జీవాలు వరుసగా మృత్యువాత పడడంతో జంతు ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. అరుదైన జంతువులు అకాల మరణంతో జూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం ఓ జిరాఫీ మృతి చెందటంతో కలకలం ప్రారంభమైంది.

వరుసగా వన్యప్రాణులు అకాల మరణంపై విచారణ జరిపించాలని జంతు ప్రేమికులు ఘోషిస్తున్నారు. ఇప్పటికే ఓ జీబ్రా, రెండు జిరాఫీలు, పెద్ద పులులు, సింహాలు, చింపాంజీలు ఈ జంతు ప్రదర్శన శాలలో మృతి చెందాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జంతుప్రదర్శన శాల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యంతోనే జంతువులు చనిపోతున్నాయని జనం ఆరోపిస్తున్నాయి.

జీబ్రాతో మరణంతో విషాదం…
ఎన్నో వ్యయ ప్రయాసలతో విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు కు 2019 నవంబర్ లో అప్పటి క్యూరేటర్ యశోదా బాయ్ ఒక జత జీబ్రాలను కలకత్తా ఆలేపురి జూ నుంచి తీసుకొచ్చారు. అనంతరం పర్యటకుల సందర్శనార్థం ఈ రెండు జీబ్రాలను ప్రత్యేక ఎంక్లోజర్ లో ఉంచారు. పక్కనే జత జీరాఫీల ఎంక్లోజర్ ను ఏర్పాటు చేశారు. వీటి పక్కన జత జీబ్రాలు ఉత్సహంగా గంతులు వేస్తూ సందర్శకులను ఎంతగానో అలరించేవి. రాజు,రాణి జీబ్రాలలో రాణి జీబ్రా(8) మార్చి 12న అనారోగ్యతో మృతి చెందింది. మృతి చెందిన జీబ్రా పొట్టలో సుమారు 16 కిలోల మట్టి, ఇసుక ఉండటం అప్పట్లో అందరినీ కలవరానికి గురిచేసింది. జూ అధికారుల ఆరోగ్య పర్యవేక్షణ లోపం వలనే రాణి జీబ్రా చనిపోయిదని జంతు ప్రేమికుల లబోదిబోమన్నారు.
వెనువెంటనే జిరాఫీ మృతి…
హుద్ హుద్ తుఫానుకు ముందు 2013లో అప్పటి జూ క్యూరేటర్ రామలింగం సమయస్ఫూర్తితో మలేషియా నుంచి జత జిరాఫీలను విశాఖ జూకు తీసుకొచ్చారు.దీనితో 2013 నుంచి ఈ జత జీరాఫీలు సందర్శకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే జీబ్రా చనిపోయిన రెండు నెలల కాలవ్యవధిలో 2023 మే 17న మే అని ముద్దుగా పిలుచుకునే ఆడ జిరాఫీ మృతి చెందింది. .సుమారు పదేళ్ల ప్రాయంలోని ఈ జిరాఫీ న్యుమోనియా, క్రానిక్ మెట్రిటిస్ తో మృతి చెందినట్లు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా ధ్రువీకరించారు.

- Advertisement -


తాజాగా మరో జిరాఫీ మృతి…
తన తోటి ఆడ జిరాఫీ మృతి చెందడంతో ఏకాకిగా మారిన బెకాన్ అనే మగ జిరాఫీ సోమవారం తెల్లవారు జామున చనిపోయింది. విశాఖ జూలో అందరినీ ఆకర్షించే రెండు జిరాఫీలు మృత్యువాత పడటంతో జిరాఫీల ఎంక్లోజర్ ఖాళీ కావటంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో పెద్దపులులు, సింహాలు,చిం పాంజీలు ఇలా అనేక మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.


వైద్యుల లేమితోనే కష్టాలు…
విశాఖ ఇందిరాగాంధీ జూలజికల్ పార్కునకు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే వరుసగా ఈ మూగ జీవాలు మృత్యుపాలవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా జూలో వైద్యుడిగా పనిచేసిన శ్రీనివాస్ జూలో వైద్యుడిగా వైదొలిగారు. దీంతో ఫణేంద్ర. పురుషోత్తం అనే వైద్యులు ప్రస్తుతం జూలో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలో వరుసగా మూగ జీవాలు మృతి చెందటంతో పూర్తి స్థాయి అనుభవజ్ఞులైన వైద్యుడిని నియమించాలని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement