ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. వెనుక నుంచి స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. బేతని స్కూల్ విద్యార్థులు ఈ ఉదయం ఆటోలో స్కూల్ వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగింది. సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. అంతే అటో పల్టీలు కొట్టింది. ఈ దెబ్బకు అటోలో ఉన్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు.
ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది. ఈ ఘటన ఉదయం విశాఖలోని సంఘం – శరత్ థియేటర్ దగ్గర చోటుచేసుకుంది. ప్రమాదం దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. పిల్లలు బోరున ఏడుస్తూ రక్తం కారుతున్న గాయాలతో రోడ్డుపై పడి ఉండటం చూసిన వారి హృదాయాలు చలించిపోయాయి. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టిన తర్వాత లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు యత్నించారు. వారి స్థానికులు, ఆటో డ్రైవర్‌లు పట్టుకొని బంధించారు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉంచి వారికి అప్పగించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. రక్తపు గాయాలతో పడి ఉన్న తమ చిన్నారులను చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. ప్రమాదంలోగాయపడ్డ విద్యార్థులను స్థానికంగా ఉండే సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.