ఈనెల 14న విశాఖలో జరుగనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్‌కు స్టేడియం అంతా రెడీ అయ్యింది. విశాఖలోని ఏఈఎంపాలెం ఏసీఐ, వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో మ్యాచ్ షెడ్యూల్ ప్రకటన వెలువడ్డ నుంచి నిమగ్నమైన అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరగక పోవడంతో స్టేడియం గ్రౌండ్లో గడ్డి బాగా పెరిగింది. దీంతో క్యూరేటర్ నాగమల్లయ్య ఆధ్వర్యంలో గడ్డిని తొలగించి మైదానం మొత్తం సమాంతరంగా తీర్చిదిద్దారు. శనివారం పిచ్‌ను యంత్రాలతో రోలింగ్ చేశారు.
పెవిలియన్ల వైపు ప్రత్యేక స్టాండ్లను, గ్యాలరీల్లోని కుర్చీలను శుభ్రం చేశారు. అదేవిధంగా కుర్చీలపై టికెట్ల నెంబర్లను అతికించారు. మరోవైపు క్రికెట్ మ్యాచ్‌ను తిలకించేందుకువచ్చే ప్రేక్షకుల కోసం ఆర్టీసీ వంద ప్రత్యేక సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపింది. మ్యాచ్ జరిగే రోజున సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు స్టేడియానికి చేరుకునేలా, రాత్రి 10 గంటల నుంచి స్టేడియం నుంచి బయల్దేరేలా బస్సులు నడుపనున్నామని విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలరాజు వెల్లడించారు.