Friday, November 22, 2024

విశాఖపట్నం ఈఎస్ఐ ఆస్పత్రికి రూ. 390 కోట్లు మంజూరు : బీజేపీ ఎంపీ నరసింహారావు

విశాఖపట్నంలో కేంద్ర కార్మిక శాఖ నిర్మించతలపెట్టిన ఈఎస్ఐ ఆస్పత్రి కోసం రూ. 390 మంజూరయ్యాయని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8 ఈఎస్ఐ ఆస్పత్రులు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం తాను సంబంధిత శాఖ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో పాటు, అధికారులతో తరచుగా సంప్రదింపులు జరుపుతున్నానని జీవీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్నం ఈఎస్ఐ ఆస్పత్రిని 400 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) ద్వారా వీలైనంత త్వరగా ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు చేపడతారని, ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జనవరి 4, 5 తేదీల్లో విశాఖపట్నం మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విశాఖపట్నం సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఈ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం తాను కృషి చేస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement