విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరోఅక్టోబర్,27: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ లో నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1923లో కళాశాల ప్రారంభమైనదని, మొట్టమొదటి సారిగా ఆంధ్రా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వారి సేవలు వివిధ రంగాల్లో అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో నూతనంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలకు వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షి ద్వారా ప్రజల ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 600 కోట్ల రూపాయలు కెజిహెచ్ అభివృద్ధికి కేటాయిస్థామన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు కోసం 246 కోట్లు వెచ్చిస్తామన్నారు .వైఎస్సార్ హెల్త్ కేర్ ఫెసిలిటిసీని విస్తృతంగా తీసుకువస్తున్నామన్నారు.
కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ను రూ.23.75 కోట్లతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియ వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో వర్చువల్ గా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పోర్ట్ సిటీగా విశాఖకి ఎంతో పేరుందన్నారు. దేశంలోనే పురాతన వైద్యకాశాలగాఊ విశాఖకు వుండటం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. ఆంధ్ర వైద్యకళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వుందన్నారు.సూపర్ స్పెషాలిటి సేవలన్నీ ఒకేచోట లభించడం మంచి పరిణామని, రోగులు వైద్యుల నిష్పత్తిలో అంతరం లేకుండా వుండాలని తెలిపారు.
మెడికల్ ఎకో సిస్టమ్ తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందన్నారు.హెల్త్ కేర్ రంగంలో తొమ్మిదేళ్లలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో సేవాభావం అవసరమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె. నివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యాంద్ర ప్రదేశ్ గా తీసుకుంటున్న చర్యల్లో పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
శాసన మండలి సభ్యులు డాక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థులకు మంచి హాస్టళ్లు నిర్మించాలని కోరగా 75 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చెప్పారు. డాక్టర్ వైయస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుస్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి రమేశ్ కుమార్, తదితరులు మాట్లాడారు. సెంటినరి సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షులు డా. టి. రవి రాజు మాట్లాడుతూ ఆంధ్రా మెడికల్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలోని వివిధ దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించారు. 1923లో కళాశాల ప్రారంభించినట్లు చెప్పారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, తదితరమైనవి మంచి కార్యక్రమాలని ఆయన వివరించారు. ఎఎంసి ప్రిన్సిపల్ బుచ్చిరాజు మాట్లాడుతూ 32 విద్యార్థులతో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రారంభించినట్లు వివరించారు. ముందుగా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలు గూర్చి తెలియజేశారు. సెంటినరీ సెలబ్రేషన్స్ సావనీర్ ను విడుదల చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.పిజి, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మెడల్స్, మెమోరియల్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున, డిఎంఈ డిఎస్విఎల్ నరసింహం, డా. వైయస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుస్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి డా ఇ. రమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ సెకండరీ ఎడ్యుకేషన్ సంచాలకులు ఎస్. వైంకటేశ్వర్, ఎంఎల్సి డాక్టర్ రవీంద్ర బాబు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బివి సత్యవతి, నార్త్ అమెరికా ప్రెసిడెంట్ మైనేని నాగేంద్ర, ఆంకోసా ప్రెసిడెంట్ కె. శశి ప్రభ, ఎఎంసి వైస్ ప్రిన్సిపాల్ డా. రాజేంద్రప్రసాద్, సెంటినరి సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్యక్షులు డాక్టర్ రవి రాజు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, ఆంధ్రా మెడికల్ కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.