విశాఖ – ప్రధాని మోడీ నోట తెలుగు మాట వినిపించింది. వైజాగ్ నగరం పులకించి మోడీ మోడీ.. అంటూ మారుమ్రోగింది. వైజాగ్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది
ఏపీలోని విశాఖలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. 2024 ఎన్నికల అనంతరం ప్రధానిగా మోడీ తొలి పర్యటన కావడంతో సీఎం చంద్రబాబు అధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి సంబంధించి వర్చువల్‌గా రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. విశాఖ రైల్వేజోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్‌పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని శంకుస్థాపన చేసారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు. రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ జాతికి అంకితం చేసారు.
.విశాఖలోని సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని రోడ్ షో సాగగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. అడుగడుగునా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని ప్రసంగం ముందు ఏపీలో చేపట్టబోయే భారీ పెట్టుబడుల గురించి వీడియోను ప్రదర్శించారు.
అనంతరం పీఎం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజల ప్రేమ , అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపేందుకు అవకాశం నాకు ఇప్పుడు లభించిందని తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కరిస్తూ.. ప్రసంగాన్ని పీఎం కొనసాగించారు. ప్రధాని మాటలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనువదించారు.
ప్రజల ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిందన్నారు. వైజాగ్ లో తనకు లభించిన స్వాగతానికి తాను ఎంతో ఆనందపడ్డానన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ఏపీ అన్ని లక్ష్యాలను చేరేందుకు తాను అన్ని రకాల సహకరిస్తానన్నారు. ఏపీ అభివృద్దితోనే, దేశం కూడ అభివృద్ది పథంలో నడుస్తుందన్నారు. ఏపీ అభివృద్ది నా విజన్ అన్న ప్రధాని, ఏపీ ప్రజల సేవకు ఎక్కడా వెనకడుగు వేయనన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు లక్షల కోట్ల ప్రాజెక్టులను ఏపీకి కేంద్రం అందిస్తుందన్నారు.
. :
రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తామని, టెక్నాలజీ పరంగా ఏపీ మరింత దూసుకుపోతుందని ప్రధాని అన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను 2023 లో ప్రారంభించామని, దేశంలోనే రెండవ హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్ట్ ను వైజాగ్ లో ఏర్పాటు చేస్తామన్నారు.
దీనితో ఏపీలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా దక్కుతాయన్నారు. భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా వైజాగ్ కు ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. నవయుగ పట్టణీకరణ కోసం కృష్ణపట్నం పోర్టు అభివృద్దికి క్రిష్ సిటీ గా ఏర్పాటు చేస్తున్నామని పీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు