Tuesday, January 7, 2025

Visakha సెంట్ర‌ల్ జైలును ప్రక్షాళన చేస్తున్నాం

ఆరిలోవ, విశాఖపట్నం (ఆంధ్రప్రభ) :ప్రశాంతతకు మారుపేరుగా ఉండే విశాఖ కేంద్ర కారాగారంలో నెల రోజులుగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్‌లకు వేదికగా ఉండే విశాఖ జైలులో వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా చర్చంశనీయమైంది. కారాగరంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఫార్మాసిస్టు ద్వారా భోజనం క్యారేజీ బాక్సులో గంజాయిని తరలించడం, పది రోజుల క్రితం జైల్ లోపల పెన్నా బేరాక్స్‌లో నాలుగు అడుగుల లోతు గోతిలో ఒక స్మార్ట్ ఫోన్, మరో కీప్యాడ్ ఫోన్, పవర్ బ్యాంగ్, రెండు డేటా కేబుల్స్ దొరకడం, తదనంతరం నాలుగు రోజుల క్రితం నర్మదా బేరాక్స్ లో మరొక కీప్యాడ్ ఫోన్‌ను మెట్లు కింద కనుక్కోవడం జ‌రిగింది. వీటన్నిటిపై హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది.

దీనిలో భాగంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అనంతరం జైలు ప్రాంగణం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు.

అణువణునా జల్లెడ పడుతున్నాం:

- Advertisement -

వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర కారాగారంలో భద్రతకు తిలోదకాలిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విశాఖ కేంద్ర కారగారంలో విచ్చల విడిగా గంజాయి సరఫరా, సెల్ఫోన్లో మంతనాలు జరిగాయని వీటికి బాధ్యులను చేస్తూ అప్పటి జైలు సూపరిండెండెంట్ కిషోర్ కుమార్ ను, మరో అధికారిని సస్పెండ్ చేసిన‌ట్టు హోం మంత్రి అనిత పేర్కొన్నారు. కేంద్రకారాగారాన్ని ప్రక్షాళన చేసేందుకు ఎం. మహేష్ బాబును జైలు సూపర్డెంట్ గా, మరో ఇద్దరి డీఎస్పీ లను జైలు శాఖ నియమించినట్లు తెలిపారు.

ఈ ముగ్గురి యువ అధికారుల సమన్వయంతో జైలును ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. పర్యవసానంగానే జైల్లో ప్రతి అంగుళం గాలించడంతో మొబైల్ ఫోన్లు ఒకటొకటిగా బయటపడుతున్నాయన్నారు

.జైల్ లోపల గంజాయి మొక్క..

తాజాగా జైల్ లోపల ఒక బేరాక్స్ గార్డెన్ ఏరియాలో ఒక గంజాయి మొక్కను కనుగొన్నట్లు హోంమంత్రి తెలిపారు. జైల్ లోపల అణువణునా సెర్చ్ చేస్తున్నాం అనడానికి ఇదే తార్కాణం అన్నారు. విశాఖ కేంద్రకారాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు.

దర్యాప్తు ముమ్మరం..

విశాఖ జైల్లో దొరికిన మొబైల్ ఫోన్ల వ్యవహారంలో ఇప్పటికే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని, ఈ ఫోన్ల ద్వారా ఖైదీలు ఎవరెవరితో మాట్లాడారు, ఎన్ని సిమ్ములు వాడారు,మొత్తం వ్యవహారంలో ఎందరి హస్తముంది అనే కోణాల్లో ఒకవైపు జైలు శాఖ, మరోవైపు ఆరిలోవ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన‌ట్టు హోం మంత్రి తెలిపారు.

15 రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందన్నారు. విశాఖ కేంద్రకారాగారంలో జరిగిన పరిణామాల విషయంలో తప్పు చేసిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన సిబ్బందిని కానీ ఖైదీలను కానీ ఎవరిని విడిచిపెట్టబోమని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement