ఆంధ్రప్రభ స్మార్ట్, ఆరిలోవ : క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాలనే సదుద్దేశంతో పీవీ సింధూ బ్యాడ్మింటన్ అకాడమీని విశాఖలో స్థాపించేందుకు సంసిద్ధమయ్యారు. ఇందు కోసం చిన్నగదిలి మండలం పెద్దగదిలో తోటగరువు హైస్కూల్ ను ఆనుకుని ఉన్న మూడు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2018లో టీడీపీ ప్రభుత్వం అకాడమీకి సంబంధించి ప్రపోజల్ నిర్వహించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని అకాడమీ నిర్వహించేందుకు కేటాయించారు. దీంతో నిర్వాహకులు తాజాగా రెండు నెలల నుంచి అకాడమీకి సంబంధించిన స్థలాన్ని చదును చేసి శంకుస్థాపన కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్నారు.
జూనియర్ కళాశాలకు కేటాయించాలని..
కాగా, హైస్కూల్‌కు ఆనుకుని ఉన్న ఈ మూడు ఎకరాల స్థలం బ్యాడ్మింటన్ అకాడమీకి ఉపయోగించవద్దని, వెంటనే ఆ ప్రపోజల్‌ను రద్దు చేయాలని, ఆ స్థలములో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ స్థానికులు కొందరు మంగళవారం ఉదయం స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో స్థానిక మహిళలు, కొందరు టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ.. అకాడమీకి వేరేప్రాంతంలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించేందుకు స్థానిక తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వాగతిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.